అమ్మదయ ఉంటే అసాధ్యమైనదేవుంటుంది ?

తమిళనాడు - తిరువారూరులో జన్మించిన శ్యామశాస్త్రి, సంగీతత్రయంలో ఒకరుగా ప్రసిద్ధి చెందాడు. అనునిత్యం కామాక్షీ అమ్మవారిని ఆరాధించే ఆయన, ఆ తల్లి దయవల్లనే తనకి సంగీత సాహిత్యాలు పట్టుపడ్డాయని చెప్పుకునేవాడు. తన సంగీత సాహిత్యాలతో అమ్మవారిని సేవించడం గురించే తప్ప ఆయనకి మరో ధ్యాస వుండేది కాదు.

అప్పట్లో రాజులను ఆశ్రయించిన పండితులు ... విద్వాంసులు సిరిసంపదలతో తులతూగుతూ ఉండేవాళ్లు. అసలా విషయాన్ని గురించి శ్యామశాస్త్రి ఆలోచించేవాడే కాదు. ఆ తల్లి అనుగ్రహం ముందు అన్నీ దిగదుడుపే అనే విధంగా ఆయన వ్యవహరించేవాడు. అలాంటి శ్యామశాస్త్రి ఇంటికి ఒకసారి రాజాస్థానం నుంచి కొంతమంది సంగీత విద్వాంసులు వస్తారు. పొరుగు రాజ్యం నుంచి వచ్చిన కేశవయ్య అనే సంగీత విద్వాంసుడు తనని గెలమంటూ విసిరిన సవాలును గురించి ప్రస్తావిస్తారు.

ఆ కేశవయ్యను ఎదుర్కునే సామర్థ్యం తమ దగ్గర లేదనీ, ఆయనని ఓడించి తంజావూరు పరువు ప్రతిష్ఠలను కాపాడవలసిందిగా శ్యామశాస్త్రిని కోరతారు. రాజ్య పరువు ప్రతిష్ఠలకు సంబంధించిన విషయం కావడంతో శ్యామశాస్త్రి అందుకు అంగీకరిస్తాడు. సరికొత్త కీర్తనతో అమ్మవారిని అభిషేకించి రంగంలోకి దిగుతాడు. రాజాస్థానానికి సంబంధంలేని వ్యక్తి పోటీకి దిగడం కేశవయ్యకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తన సంగీత సామర్థ్యం ముందు ఎవరైనా తీసుకట్టేననుకుంటాడు.

పోటీ మొదలవుతుంది ... సంగీతంలో ఎల్లలులేని శ్యామశాస్త్రి ప్రతిభాపాటవాలు చూసి కేశవయ్య బిత్తరపోతాడు. మూర్తీభవించిన సంగీత సరస్వతిగా కనిపించే ఆయనలో రవ్వంతైనా అహంభావం లేకపోవడం చూసి ఆశ్చర్యపోతాడు. అజ్ఞానంతో ఆయనతో పోటీకి దిగినందుకు మన్నించమని కోరుతూ శ్యామశాస్త్రి పాదాలపై పడతాడు. తంజావూరు పరువు ప్రతిష్ఠలను కాపాడినందుకు అక్కడి సంగీత విద్వాంసులు శ్యామశాస్త్రికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. అమ్మదయ వుంటే అసాధ్యము ... అపజయము వుండవంటూ ఆయన ఆ కామాక్షీ దేవికి మనసులోనే కృతజ్ఞతలు సమర్పిస్తాడు.


More Bhakti News