లంకెబిందెలను చూపించిన దేవుడు

నారు పోసినవాడే నీరు పోస్తాడు అనే నానుడి చాలా చోట్ల చాలా సందర్భాల్లో వినిపిస్తూ వుంటుంది. ఈ నానుడికి తగినట్టుగానే గుడికట్టమని చెప్పిన దేవుడే అందుకు అవసరమైన నిధిని కూడా ఏర్పాటు చేసిన సంఘటన ఒక క్షేత్రంలో కనిపిస్తుంది. అదే గుంటూరు జిల్లాలోని 'యనమదల' ... ఇక్కడే వీరభద్రస్వామి ఆలయం విలసిల్లుతోంది. ఈ స్వామియే తన ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధిని భక్తుడికి అందజేసినట్టు స్థలపురాణం చెబుతోంది.

పూర్వం ఒక భక్తుడు తన గ్రామంలో వీరభద్రస్వామి మందిరాన్ని నిర్మించాలనుకుంటాడు. అందుకోసం ఆ పక్కనే గల గ్రామంలోని శిల్పిచేత స్వామి విగ్రహాన్ని ... నంది విగ్రహాన్ని తయారుచేయించి దున్నపోతుల బండిలో బయలుదేరుతాడు. మార్గమధ్యలో ఒక చెరువు పక్కనేగల చెట్టుకింద విశ్రమిస్తాడు. అప్పుడు ఆ భక్తుడికి స్వప్నంలో కనిపించిన వీరభద్రుడు, ఆ ప్రదేశంలోనే తన ఆలయ నిర్మాణం జరపమని ఆదేశిస్తాడు. అంత స్తోమత తనకి లేదని ఆ భక్తుడు చెప్పడంతో, దున్నపోతులను చెరువులోకి వదలమని సూచించి స్వామి అదృశ్యమవుతాడు.

మెలకువరాగానే ఆ భక్తుడు అలాగే చేస్తాడు. చెరువులోకి దిగిన దున్నపోతులు, కొమ్ములకు 'లంకెబిందెలు' తగిలించుకుని రావడం చూసి ఆ భక్తుడు ఆనందాశ్చర్యాలకు లోనవుతాడు. విషయాన్ని అక్కడి గ్రామస్తులకు తెలియజేసి, ఆ నిధితో ఆలయాన్ని నిర్మిస్తాడు. అలా స్వామి ప్రసాదించిన లంకె బిందెలతో నిర్మించబడినది కావడం వలన ఈ క్షేత్రం మహిమాన్వితమైనదిగా భక్తులు చెప్పుకుంటూ వుంటారు. ఆ స్వామిపట్ల తమకి గల భక్తిశ్రద్ధలు చాటుకుంటూ వుంటారు.


More Bhakti News