ఎవరి పూజలను దేవతలు స్వీకరించరు?

జీవితం భగవంతుడి ప్రసాదంగా భావించిన ప్రతి ఒక్కరూ ఆయనని ఆరాధిస్తూనే ఉంటారు. ఉదయాన్నే నిద్రలేచి .. స్నానం చేసి .. పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి ఇష్టదేవతను పూజిస్తూ వుంటారు. తమకి కావలసిన వాటిని సమకూర్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఆశించేవాటిని అందించమని కోరుతూ వుంటారు. అయితే అందరూ కూడా ఎవరికి గల పరిజ్ఞానం మేరకు వాళ్లు భగవంతుడిని పూజించి తమ దైనందిన కార్యక్రమాల్లో మునిగిపోతుంటారు. తాము చేసిన పూజలను భగవంతుడు స్వీకరించాడా ... లేదా ? అనే విషయాన్ని గురించి పెద్దగా ఆలోచించరు.

మనకి ఎవరి స్వభావమైనా నచ్చకపోతే వారికి ఏదైనా ఇవ్వడం కానీ, స్వీకరించడం కాని చేయం. అలాగే భగవంతుడు కూడా తాను ఆశించే లక్షణాలు గలవారి పూజలను మాత్రమే స్వీకరిస్తాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ప్రతిఒక్కరి నుంచి నీతి .. నిజాయితీలతో కూడిన ధర్మబద్ధమైన జీవితాన్ని భగవంతుడు ఆశిస్తాడు. అందుకు తగిన విధంగా నడచుకోకుండా ఎంత హడావిడి చేసినా వారి పూజలను ఆయన ఎంత మాత్రం పట్టించుకోడు.

ముఖ్యంగా తల్లిదండ్రులను ప్రేమించేవారిని భగవంతుడు ఎంతగానో ఇష్టపడతాడు. కన్నవారిపట్ల వారి పిల్లలు చూపించే ఆప్యాయతానురాగాలు చూసి ముచ్చటపడతాడు. అలాంటివారి కోరికలు నెరవేర్చడానికి ఆసక్తిని చూపిస్తాడు. తల్లిదండ్రులను ప్రేమించలేనివాళ్లు ఈ లోకంలో మరిదేనినీ ప్రేమించాలేరని ఆయన విశ్వసిస్తాడు. అందువలన అలాంటివారి పూజలు అందుకోవడానికి ఆయన అయిష్టతను వ్యక్తం చేస్తాడు.

ఆధునిక కాలంలో తల్లిదండ్రులను పట్టించుకోని వారి సంఖ్య పెరిగిపోతోందనేది అందరికీ తెలిసిన విషయమే. కన్నవాళ్లను కన్నెత్తి చూడకుండా భార్యాబిడ్డలే లోకంగా బతికేస్తున్న వాళ్లు ఎంతోమంది తారసపడుతుంటారు. బిడ్డల సంతోషమే తమ ఆనందంగా భావిస్తూ దుఃఖాన్ని దిగమింగుకునే తల్లిదండ్రులు కూడా ఎంతోమంది కనిపిస్తుంటారు.

సాధారణంగా ఎవరైనా చిన్నపాటి సాయం చేస్తేనే వాళ్లపట్ల ఎప్పటికీ ఎంతో కృతజ్ఞతను కలిగి వుండటం జరుగుతూ ఉంటుంది. అలాంటిది జన్మను ఇచ్చిన వాళ్లను మరిచిపోవడాన్ని భగవంతుడు క్షమించలేని నేరంగా పరిగణిస్తాడు. అందువల్లనే .. తల్లిదండ్రుల మనసును బాధపెడుతూ, తనకి చేసే పూజలను ఆయన ఎంతమాత్రం స్వీకరించడు.


More Bhakti News