ఆ స్వామి ఆచూకీని ఆవులే కనుక్కున్నాయట!

శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాలలో కృష్ణావతారానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ అవతారంలో ఆయన గోవులతో .... గోపాలకులతో విడదీయరాని అనుబంధాన్ని పెంచుకున్నాడు. ఈ కారణంగానే ఆయన తిరుమల కొండలపై గోవు పాలధారలతో వెలుగులోకి వచ్చాడు ... గోపాలకుడిని అనుగ్రహించాడు. తన పేరు కృష్ణుడనే 'వకుళమాత' కు చెబుతూ, ఆమెయే యశోదాదేవి అనే విషయాన్ని గుర్తుచేశాడు.

ఆనాటి కృష్ణుడే వేంకటేశ్వరస్వామిగా చెప్పబడుతోన్న కారణంగా, ఆయన చాలా క్షేత్రాల్లో ఆవుల పాలధారలతోనే భక్తులకు తన ఆచూకీని తెలియజేశాడు. వాళ్లచే నిత్యనీరాజనాలు అందుకుంటూ అనుగ్రహిస్తున్నాడు. అలాంటి మహిమాన్వితమైన క్షేత్రం మనకి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో గల 'గుడబల్లూరు'లో దర్శనమిస్తుంది. సాధారణంగా వేంకటేశ్వరస్వామి స్వయంభువుగా పుట్టలో దాగి ఉండటం ... ఆవులు ఆ పుట్టలో పాలు వదలడం ... ఆ దృశ్యం గోపాలకులు చూడటం వలన స్వామివారిమూర్తి వెలుగుచూడటం జరుగుతూ ఉంటుంది.

కానీ అందుకు కాస్త భిన్నమైన కథ ఈ క్షేత్రంలో వినిపిస్తూ ఉంటుంది. మహర్షుల కాలంలో స్వయంభువుగా ఇక్కడి కొండగుహలో ఆవిర్భవించి పూజలందుకున్న స్వామి, ఆ తరువాత పుట్టలో గోప్యంగా ఉండిపోయాడు. కాలక్రమంలో ఒక రోజున పశువుల కాపరులు ఆవులను మేపుకు రావడానికి ఈ కొండపైకి వచ్చారు. ఆ కొండపై గల గుహ వైపు వెళ్లడానికి ఆవుల మంద ప్రయత్నిస్తూ ఉందట.

పాలుతాగడానికి దూడ ఎలా తల్లి దగ్గరికి రావడానికి ఆరాటపడుతుందో, అదే విధంగా ఆవులు ఆ గుహలోకి వెళ్లడానికి ఆరాటపడసాగాయి. ఆవుల మందని నియంత్రించలేకపోయిన పశువుల కాపరులు, వాటి వెనుకే ఆ గుహలోకి వెళ్లారు. అక్కడ గల ఒక పుట్టలో నుంచి కాంతి రేఖలు ... సుగంధ పరిమళాలు వెలువడసాగాయి. ఆవులన్నీ కూడా ఆ పుట్టచుట్టూ చేరి అదే పనిగా అరవసాగాయి.

పుట్టలోపల శ్రీదేవి - భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ప్రతిమలు వుండటం పశువుల కాపరులు చూశారు. వాటిని అక్కడ ప్రతిష్ఠించడంలో వాళ్లు ప్రధానమైన పాత్రను పోషించారు. ఇక్కడి స్వామిని ఆరాధించడం వలన పశుసంపద వృద్ధి చెందుతుందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు. స్వామివారికి వెన్న - పాలను నివేదిస్తూ తమ భక్తి శ్రద్ధలను చాటుకుంటూ ఉంటారు. మహిమాన్వితమైన ఈ క్షేత్రానికి చేరుకోవడం వలన ... మనోహరమైన స్వామివారి రూపాన్ని దర్శించడం వలన సకలశుభాలు చేకూరతాయని విశ్వసిస్తూ ఉంటారు.


More Bhakti News