భక్తుడి కోసం ఆగిపోయిన భగవంతుడి రథం !

ఏదైనా ఒక ముఖ్యమైన పనిమీద బయటికి బయలుదేరుతుండగా, అదే సమయంలో దగ్గరి బంధువులు వస్తుంటారు. వారి పట్ల గల అభిమానంతో కాసేపు బయటికి వెళ్లే పనిని వాయిదా వేసుకోవడం జరుగుతూ వుంటుంది. స్నేహితుల కోసమో ... బంధువుల కోసమో కాసేపు ఆగడం అనేది ఏరకంగాను విశేషం కాదు. కానీ ఊరేగింపు కోసం బయలుదేరిన భగవంతుడు, ఓ భక్తుడి కోసం ఆగిపోవడం సాధారణ విషయం కాదు. ఇలాంటి సంఘటనలు ఆ భక్తుల యొక్క అసమానమైన భక్తికీ, భగవంతుడు చూపే అపారమైన కరుణకు అద్దం పడుతుంటాయి.

ఆశ్చర్యచకితులను చేసే ఇలాంటి సంఘటన మనకి 'త్యాగరాజస్వామి' జీవితంలో కనిపిస్తుంది. నిరంతరం శ్రీరామ నామసంకీర్తనంలో తేలియాడే త్యాగరాజస్వామికి ఒకసారి శ్రీరంగనాథుడిని చూడాలనిపిస్తుంది. ఆ స్వామిని అనేక విధాలుగా కీర్తిస్తూ ఆయన శ్రీరంగం చేరుకుంటాడు. ఆ సమయంలో ఆ క్షేత్రంలో స్వామివారికి అంగరంగవైభవంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. స్వామివారి రథం చూడగానే త్యాగరాజస్వామి మనసు సంతోషంతో పొంగిపోతుంది.

రథంపై కూర్చున్న రంగనాథుడి దర్శనం చేసుకోవడానికి ఆయన వేగంగా అక్కడి నుంచి కదులుతాడు. కానీ భక్తజన సందోహం ఎక్కువగా ఉండటం వలన ఆయన రథం దగ్గరికి చేరుకోలేకపోతాడు. ఆయన స్వామిని చూడకముందే ఆ రథం ఆయనని దాటుకుని ముందుకి వెళుతుంది. ఆ విషయాన్ని గురించి ఆయన బాధపడుతూ వెనుదిరిగి చూడగా, రథం అక్కడ ఆగిపోయి వుంటుంది. అది ఎందుకు ఆగిపోయిందో తెలియక అంతా ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తుంటారు. కారణమేమిటనేది గ్రహించిన కొందరు త్యాగరాజస్వామిని రథం దగ్గరికి తీసుకువస్తారు.

ఆనందంతో ఆత్రుతగా స్వామివారి చెంతకు చేరుకున్న త్యాగరాజస్వామి, రంగనాథుడి వైపు మురిపెంగా ... ముచ్చటగా చూస్తాడు. సమస్త లోకాలను నడిపించే స్వామి తన కోసం ఆగడంతో, కళ్లు ఆనందబాష్పాలు వర్షిస్తూ ఉండగా నమస్కరిస్తాడు. అనురాగపూర్వకంగా ఆ స్వామిని కీర్తిస్తూ హారతి ఇస్తాడు. అంతే రథం ఎప్పటిలా గంగాతరంగంలా ముందుకు పరుగులు తీస్తుంది. అద్భుతమైన ఈ దృశ్యాన్ని తిలకించే భాగ్యం కలిగినందుకు పరవశిస్తూ భక్తులు ఆ రథం వెంట పరుగులుతీస్తారు.


More Bhakti News