సుదీర్ఘ వ్యాధులను నివారించే శివగంగ తీర్థం

సాధారణంగా పుణ్యక్షేత్రాలన్నీ కూడా పచ్చని ప్రకృతి ఒడిలో జలపాతాల జోలపాట వింటున్నట్టుగా అనిపిస్తూ వుంటాయి. చల్లని గాలి ... స్వచ్ఛమైన నీళ్లు ... ఆ రెండింటిని అందించే పచ్చని కొండలను చూడగానే మనసుకు కావలసిన ప్రశాంతత లభిస్తుంది. ప్రతి పుణ్యక్షేత్రంలోను పుణ్యతీర్థాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ తీర్థాలలో స్నానాలు చేయడం వలన అనేక దోషాలు నశించి, శుభాలు కలుగుతాయని స్థలపురాణం చెబుతుంటుంది.

నిజానికి ఇటు మానసికంగా ... అటు శారీరకంగా అనారోగ్యంపాలైనవాళ్లు, వాటి బారి నుంచి బయటపడటం కోసమే ఈ తీర్థాలలో స్నానం చేయడానికి వస్తుంటారు. అలాంటి వాళ్లు రాలేని పరిస్థితుల్లో వుంటే, వారి కుటుంబీకులు సీసాల్లో ఆ నీటిని ఇంటికి తీసుకు వెళుతుంటారు. అలా వ్యాధులను నివారించే తీర్థంగా భక్తుల విశ్వాసాన్ని పొందిన తీర్థం మనకి 'చిదంబరం'లో కనిపిస్తుంది. ఈ తీర్థం మహిమాన్వితమైనదని చెప్పే కథనం ఒకటి స్థలపురాణంగా వినిపిస్తుంది.

పూర్వం 'శ్వేతవర్మ' అనే రాజు సుదీర్ఘమైన వ్యాధితో నానాబాధలుపడుతూ ఉండేవాడట. ఎంతమంది రాజ వైద్యులను రప్పించినా వాళ్లు ఆయనకీ ఉపశమనం కూడా కలిగించలేకపోతారు. ఒకవైపున అంతులేని సిరిసంపదలు ... మరోవైపున అనుభవించడానికి అవకాశంలేని అనారోగ్యం ఆయనని మానసికంగా కుంగదీయసాగింది. అలాంటి పరిస్థితుల్లో ఆయన తాను పూర్తి ఆరోగ్యాన్ని పొందడానికి పరిష్కారమార్గం ఏదైనా ఉంటే చెప్పమని రాజ్యంలో చాటింపు వేయిస్తాడు.

అప్పుడొక మహర్షి ఆయన ఆస్థానానికి విచ్చేసి, చిదంబరం'లో గల 'శివగంగ తీర్థం' విశిష్టతను గురించి చెబుతాడు. ఆ తీర్థంలో స్నానమాచరించడం వలన అనారోగ్యాలు తొలగిపోయి ఆయుష్షు పెరుగుతుందని అంటాడు. దాంతో రాజుగారు తన పరివారంతో కలిసి చిదంబరం క్షేత్రానికి చేరుకొని, శివగంగ తీర్థంలో స్నానం చేస్తాడు. అంతకాలంగా తనని పీడిస్తూ వచ్చిన వ్యాధి, ఒక్కసారిగా తగ్గిపోవడంతో ఆయన ఆనందాశ్చర్యాలకి లోనవుతాడు. మహిమ గల ఆ తీర్థానికి కృతజ్ఞతలు తెలుపుకుని, స్వామి దర్శనం చేసుకుంటాడు. ఆనాటి నుంచి ఈ క్షేత్ర మహాత్మ్యం సామాన్యులకు సైతం తెలిసేలా వెలుగులోకి వచ్చింది.


More Bhakti News