జపమాల మెడలో ధరించకూడదా ?

జపతపాలతో భగవంతుడిని ఆరాధించడం వలన ఆయన మనసును తొందరగా గెలుచుకోవచ్చునని పురాణాలు చెబుతున్నాయి. ముందు యుగాలలో మహర్షులు యజ్ఞయాగాలను విరివిగా నిర్వహించారు. అదేపనిగా తపస్సులు చేశారు. కలియుగంలో భగవంతుడి అనుగ్రహానికి తపస్సు చెప్పబడలేదు. స్మరణం మాత్రంచేత భగవంతుడి కృపాకటాక్షాలకు పాత్రులు కావొచ్చని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.

భగవంతుడి నామాన్ని ఎక్కడపడితే అక్కడ ... ఇష్టం వచ్చిన విధంగా స్మరించడం కాకుండా, మహర్షులు ఒక నియమం చేయడం జరిగింది. ఉదయాన్నే స్నానం చేసి .. పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి ... పవిత్రమైన ప్రదేశంలో చాప వంటి ఆసనంపై కూర్చుని జపం చేసుకోవాలని చెప్పడం జరిగింది. శ్రీమహావిష్ణువుకు 'తులసి' ... సదాశివుడికి 'రుద్రాక్ష' ప్రీతికరమైనవి కనుక, వారిని ఆయా జపమాలలతో స్మరించాలని సెలవిచ్చారు.

ఇక స్పటిక ... తామర ... పగడపు పూసలతో జపం చేసేవాళ్లు లేకపోలేదు. ఒక్కో జపమాల వలన ఒక్కో ఫలితం వుంటుంది. ఇక ఆధ్యాత్మిక ప్రపంచంలో 108 అనే సంఖ్యకు ఎంతో విశిష్టత వుంది కనుక, ఇష్టదైవం నామాన్ని 108 మార్లు స్మరించాలని మహర్షులు నిర్ణయించడం జరిగింది. ఆధ్యాత్మిక వాతావరణం అధికంగా గల కుటుంబాలవారు అనునిత్యం జపం చేసుకుంటూ వుంటారు. ఇక మిగతా వాళ్లు ఏదైనా దీక్ష తీసుకున్నప్పుడు మాత్రమే జపం చేస్తుంటారు.

వేంకటేశ్వరస్వామి ... శివుడు ... అయ్యప్పస్వామి ... ఆంజనేయస్వామి ... భవానీ మండల దీక్షలు తీసుకుని జపాలు చేసే వాళ్లు ఎక్కువగా కనిపిస్తుంటారు. అయితే చాలామంది దీక్ష ప్రారంభంలో రెండు తులసిమాలలు ధరించి ... జపం సమయంలో ఒకదానిని తీసి జపం చేస్తుంటారు. మరికొందరు ఒక మాల మాత్రమే తీసుకుని దానితోనే జపం చేసి ... జపం పూర్తి కాగానే తిరిగి దానినే ధరిస్తూ వుంటారు. ఈ విధంగా చేయడం వలన జపమాల అపవిత్రమై పోవడమే కాకుండా, తన సహజసిద్ధమైన శక్తిని కోల్పోతుంది. అనేక దోషాలను మూట గట్టుకోవలసి వస్తుందని శాస్త్రం చెబుతోంది.

ఒక మాల మెడలో ధరించి, మరోమాలను పూజా మందిరంలోనే ఉంచాలి. జపం చేసే సమయంలో పూజా మందిరంలో ఉంచిన మాలను మాత్రమే ఉపయోగించాలి. జపం తరువాత ఆ మాలను తిరిగి పూజా మందిరంలోనే ఉంచాలి గానీ మెడలో ధరించకూడదు. ఈ నియమాన్ని పాటించడం వలన మాత్రమే జప ఫలితం పరిపూర్ణంగా లభిస్తుందనే విషయాన్ని మరిచిపోకూడదు.


More Bhakti News