కలలో ఇవి కనిపిస్తే ధనలాభమే !

కలలు రావడం సహజం ... ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజున ఏదో ఒక కల వస్తూనే వుంటుంది. వచ్చిన కలను బట్టి మనసు ఆనందపడటమో ... ఆందోళన చెందడమో జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో వచ్చింది మంచి కల అయితే అది నిజం కావాలని ఆశపడతారు. పీడ కల అయితే నిజం కాకూడదని కోరుకుంటారు.

అయితే అన్ని కలలకు ఫలితాలు వుండవు. ఆరోగ్యవంతులకు ... అందునా తెల్లవారుజామున వచ్చిన కలలకు మాత్రమే ఫలితం ఉంటుందని చెప్పబడుతోంది. ఇక కలలో కనిపించిన దృశ్యాలనుబట్టి అవి అందించే ఫలితాలు ఉంటూవుంటాయి. ఈ నేపథ్యంలో కొన్ని కలలు ధనయోగాన్ని సూచిస్తూ వుంటాయి. కలలో అద్దం కనిపించినా ... బంగారు ఆభరణాలు కనిపించినా ధనయోగం పడుతుంది. అద్దం లక్ష్మీదేవి ఆవాసంగా ... బంగారం ఆమె స్వరూపంగా చెప్పబడుతోన్న కారణంగా ఈ కల బలమైన విశ్వాసాన్ని కలగజేస్తూ వుంటుంది.

ఇక వెలుగుతున్న దీపం కలలో కనిపించడం, త్వరలో కలగనున్న ధనలాభాన్ని సూచిస్తూ వుంటుంది. శంఖం ... గురిగింజలు ... గవ్వలు లక్ష్మీకారకాలుగా చెబుతుంటారు గనుక, ఇవి కలలో కనిపించడం వలన శ్రీమంతులయ్యే అవకాశాలున్నాయి. పొలము ... నాగలి, ఆవుదూడలు పాడిపంటలను సూచిస్తూ వుంటాయి. ఇవి కలలోకి రావడాన్ని, అనతికాలంలో చేకూరే సంపదలకు సంకేతంగా చెప్పుకోవచ్చు. ఇక అనేక తేనెపట్లను కలలో చూసినట్టయితే, ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అందువలన ఈ కలలు వచ్చిన వాళ్లు ఆందోళన చెందకుండా, ధనలక్ష్మి తలుపుతట్టే సమయం కోసం ఎదురుచూస్తూ ఆనందంగా ఉండవచ్చు


More Bhakti News