పరశురామ జయంతి రోజున ఏం చేయాలి ?

పరశురాముడు అనే పేరు వినగానే భుజాన గొడ్డలి పెట్టుకుని ఆవేశం ... పరాక్రమం మూర్తీభవించిన రూపం కళ్లముందు కదలాడుతుంది. చురుకైన చూపులు ... పదునైన పరశువుతో కనిపించే పరశురాముడు, జమదగ్ని - రేణుకాదేవి దంపతులకు వైశాఖ శుద్ధ విదియ రోజున జన్మించాడు. ఆశ్రమ వాతావరణంలో పెరిగి .. తండ్రి నిర్వహించే యజ్ఞ యాగాలకు అవసరమైన సమిధలను పరశురాముడు సమకూరుస్తూ ఉండేవాడు.

అలాంటి పరశురాముడు ముని వేషధారణలో ఆగ్రహావేశాలను వ్యక్తం చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ వుంటుంది. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఆ అవతారాన్ని ధరించడం వలన ఆయన ధాటికి తట్టుకుని నిలబడటం మానవమాత్రులకు సాధ్యం కాదు. పరశురాముడు మహా తపోబల సంపన్నుడు. ఆయన ఆవేశంగా కనిపించడం వెనుక అర్థం లేకపోలేదు.

ధ్యానంలో వున్న తన తండ్రిని క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు హతమార్చడం, తాము ఎంతో ప్రేమానురాగాలతో చూసుకునే కామధేనువును బలవంతంగా తీసుకువెళ్లడాన్ని ఆయన క్షమించలేకపోతాడు. ఈ కారణంగానే క్షత్రియ సంహారం చేస్తాడు. కన్నతండ్రి మాట జవదాటక పోవడం ... కన్నతల్లి కోరికను నెరవేర్చడం పుత్రధర్మం అనే విషయాన్ని పరశురాముడి అవతారంలో శ్రీమహావిష్ణువు లోకానికి చాటాడు.

అందువల్లనే పరశురాముడి జయంతి రోజున శ్రీమహావిష్ణువును పూజించాలని శాస్త్రం చెబుతోంది. ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. పూజామందిరంలో శ్రీమహావిష్ణువు చిత్రపటాన్ని అలకరించి, ఆయన వెండి ప్రతిమను పంచామృతాలతో అభిషేకించాలి. భక్తి శ్రద్ధలతో స్వామిని ఆరాధించి, ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలి.

ఉదయం నుంచి ఉపవాస దీక్షను చేపట్టి ... దగ్గరలో గల వైష్ణవ క్షేత్రాలను దర్శిస్తూ ... విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ గడపాలి. ప్రదోష కాలలో స్వామిని షోడశ ఉపచారాలతో పూజించి .. నైవేద్యాలు పెట్టాలి. ఈ విధంగా పరశురామ జయంతి రోజున విష్ణుమూర్తిని పూజించడం వలన విజయాలు ... సంపదలు లభిస్తాయని చెప్పబడుతోంది.


More Bhakti News