తాళిబొట్టు

స్త్రీ జీవితంలో మాంగల్యానికి అత్యంత ప్రాధాన్యత వుంది. పెద్దల సమక్షంలో దేవతల సాక్షిగా ధరించిన 'తాళిబొట్టు'ను ఆమె ఎంతో పవిత్రంగా ... ప్రాణప్రదంగా చూసుకుంటూ ఉంటుంది. పూర్వం 'తాటి ఆకు'లో చిన్న ముక్కను రిబ్బనులా చుట్టి, దానికి పసుపు కుంకుమలు పెట్టి మూడుముళ్లు వేయించే ఆచారం ఉండేది. ఆ తాటిబొట్టే కాలక్రమంలో 'తాళిబొట్టు'గా మారింది. ఆ తరువాత పసుపుకొమ్మును కట్టడం ఆనవాయతీగా రావడం వలన 'పసుపుతాడు' అయింది.

తాళి అనే సూత్రానికి 'తల్లిబొట్టు - గిన్నెబొట్టు' అనే పేరుతో పుట్టింటివారి బొట్టు ... అత్తింటివారి బొట్టు ఉంటాయి. ఇటు పుట్టింటి గౌరవం ... అటు అత్తింటి మర్యాదను కాపాడాలనే విషయం ఇల్లాలికి ఎప్పుడూ గుర్తుచేస్తూ ఉండటమే తాళి బొట్టులో దాగిన అసలైన అర్ధం ... పరమార్ధం. ఇక ఎంత పేదరికం ఉన్నప్పటికీ తాళిబొట్టు మాత్రం బంగారపుదే చేయించే ఆచారం తరతరాలుగా వస్తోంది. అయితే ఈ ఆచారం వెనుక కూడా ఆరోగ్య పరమైన అర్ధం లేకపోలేదు.

బంగారంపై నుంచి పారిన నీరు వలన 'చర్మ వ్యాధులు' నివారించబడతాయి. శరీరంలోని వేడి తగినంత మాత్రమే ఉండేలా ఇది నియంత్రణ చేస్తూ ఉంటుంది. బంగారం చలవ చేయడమే కాకుండా వీర్యాన్ని వృద్ధి చేస్తుంది. హృదయ సంబంధమైన వ్యాధుల బారి నుంచి కాపాడుతూ, ఆయుష్షును పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ కారణంగానే బంగారాన్ని ఆయుర్వేద వైద్యంలో విరివిగా వాడుతుంటారు. ఇలా తాళిబొట్టు అనేది వివాహిత స్త్రీగా సమాజంలో ఒక గౌరవమైన స్థానాన్ని కల్పించడమే కాకుండా, ఆరోగ్యాన్ని అందిస్తూ జీవితాన్ని ఆనందమయం చేస్తుంది.


More Bhakti News