క్రమక్రమంగా బరువెక్కిన హనుమంతుడు !

మాణిక్య ప్రభువులవారు తమ గ్రామంలో హనుమంతుడి ఆలయాన్ని నిర్మించి, అందులో విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అనుకుంటాడు. భక్తుల సహాయ సహకారాలు పూర్తిగా ఉండటంతో, అందుకు సంబంధించిన ప్రయత్నాలు చురుకుగా జరుగుతూ వుంటాయి. ఆలయం పూర్తి కావొస్తున్నా విగ్రహానికి సంబంధించిన విషయాల గురించి స్వామీజీ మాట్లాడకపోవడం శిష్యులకు ... భక్తులకు అయోమయాన్ని కలిగించసాగింది.

అనుకున్న సమయం దగ్గరపడుతూ ఉండటంతో, వాళ్లు స్వామీజీ దగ్గరికి వెళతారు. హనుమంతుడి విగ్రహం ఎక్కడ తయారవుతున్నదో, ఎప్పటికి తమ గ్రామానికి చేరుకుంటుందో తెలియపరచవలసిందిగా కోరతారు. కంగారుపడవలసిన పనిలేదనీ ... హనుమంతుడే తమ గ్రామాన్ని వెతుక్కుంటూ వస్తున్నాడని స్వామి చెబుతాడు.

అంతలో కాషాయరంగు వస్త్రాలను ధరించిన ఒక వ్యక్తి హనుమంతుడి విగ్రహాన్ని మోస్తూ అక్కడికి వస్తాడు. కుదురుగా చక్కని పరిమాణంలో కనిపిస్తోన్న ఆ విగ్రహాన్ని చూసి స్వామీజీ శిష్యులు ఆశ్చర్యపోతారు. తనకి లభించిన హనుమంతుడి విగ్రహాన్ని చాలాకాలం నుంచి మోస్తూ అనేక ప్రదేశాలకు తిరుగుతున్నానని ఆ వ్యక్తి చెబుతాడు. ఎక్కడ విగ్రహం బరువెక్కితే అక్కడ ప్రతిష్ఠ చేయబడతానని తనతో హనుమంతుడు చెప్పినట్టుగా సెలవిస్తాడు. ఆ గ్రామంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి హనుమంతుడి విగ్రహం క్రమక్రమంగా బరువెక్కుతూ వుందని చెబుతాడు.

తనకి కూడా స్వామివారి ఆదేశమయ్యిందనీ ... ఆయన కోసమే ఎదురుచూస్తున్నానని చెబుతాడు స్వామి. ఆ వ్యక్తి తలపై నుంచి హనుమంతుడి విగ్రహాన్ని దించి అతణ్ణి సత్కరిస్తారు. అక్కడి నుంచి హనుమంతుడిని ఊరేగింపుగా తీసుకెళ్లి, కొత్తగా నిర్మించిన ఆలయంలో ప్రతిష్ఠిస్తారు. స్వామి చేతులమీదుగా నిర్మించబడిన హనుమంతుడి ఆలయం అక్కడి ప్రజల జీవన విధానాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. మాణిక్య ప్రభువులవారితో అక్కడి ప్రజలకు గల బంధాన్ని మరింత ధృడంగా మారుస్తుంది.


More Bhakti News