నడి సముద్రంలో వున్నా విశ్వాసమే రక్షిస్తుంది!

శిరిడీ సాయిబాబాకు ... అక్కల్ కోట స్వామికి చాలా విషయాల్లో దగ్గర పోలికలు కనిపిస్తాయి. ఇద్దరూ కూడా అప్పటికప్పుడు కోపంతో మండిపడతారు ... అంతలోనే ఆప్యాయంగా పలకరిస్తారు. సమయస్పూర్తి చూపడంలోను ... చమత్కారాలు చేయడంలోను ఇద్దరూ ఇద్దరే! పెద్దల్లో పెద్దగా వ్యవహరిస్తూనే చిన్నపిల్లలతో సరదాగా వుంటారు. తమ దగ్గరికి ఎవరు ఏ ఉద్దేశంతో వచ్చారనేది వెంటనే గ్రహిస్తారు.

తాము వున్నచోటు నుంచి కదలకుండా ఎక్కడో దూరాన ఆపదలోపడిన తమ భక్తులను రక్షిస్తారు. ఒకసారి అక్కల్ కోట స్వామి తనని దర్శించడానికి వచ్చిన ఒక భక్తుడితో మాట్లాడుతున్నాడు. ప్రశాంతంగా వున్న ఆయన ఒక్కసారిగా పైకి లేచి '' నేనొస్తున్నాను .. నీకేమీ కాదు '' అంటూ అరుస్తాడు. ఆయన అటూ ఇటు పరిగెడుతూ ఎవరినో గోతిలో నుంచి పైకి లాగుతున్నట్టుగా ప్రవర్తిస్తాడు. ఆ సమయంలో ఆయన వళ్లంతా తడిసి ముద్దైపోతుంది.

అలా కొంతసేపు అయ్యాక '' హమ్మయ్య .. వాడు బయటపడ్డాడు '' అంటూ ఆయన తన స్థానంలో కూర్చుంటాడు. అక్కడున్న వాళ్లకి ఇదంతా అయోమయంగా అనిపిస్తుంది. మూడురోజుల తరువాత ఒక జాలరి స్వామి సన్నిధికి చేరుకొని ఆయన పాదాలకి నమస్కరిస్తాడు. నడి సముద్రంలో తన పడవ బోల్తాపడి తాను మునిగిపోతుంటే కాపాడినందుకు స్వామికి కృతజ్ఞతలు తెలియజేస్తాడు. చిరునవ్వుతో స్వామి ఆయనని చూస్తూ ఆశీర్వదిస్తాడు.

తాను పిలవగానే క్షణాల్లో స్వామి అక్కడ ప్రత్యక్షమయ్యాడనీ, తనకి చేయి అందించి తీరానికి చేర్చాడని అక్కడి వారికి చెబుతాడు. మూడు రోజుల క్రితం స్వామి ఎందుకలా విచిత్రంగా ప్రవర్తించాడో, ఎందుకాయన అలా పూర్తిగా తడిసిపోయారనేది అప్పుడు వాళ్లకి అర్థమవుతుంది. ఇక శిరిడీ సాయిబాబా కూడా ఇలాగే సముద్రంలో మునిగిపోతున్న నౌక నుంచి తన భక్తుడిని కాపాడటం, మహిమల విషయంలో వీరిద్దరికీ గల దగ్గర పోలికను మరోమారు తెలియజేస్తోంది.


More Bhakti News