పూజా మందిరంలో ఇది వుంటే చాలు !

పూజామందిరాల్లో ఎవరి ఇష్ట దైవానికి సంబంధించిన చిత్రపటాలను వుంచి వాళ్లు పూజిస్తూ వుంటారు. కొంతమంది దేవుడి ప్రతిమలకు ... మరికొంత మంది వాటితో పాటు రుద్రాక్షలకు ... సాలగ్రామాలకు కూడా పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఈ విధమైన పూజాభిషేకాల వలన మానసిక ప్రశాంతతతో పాటు, అనేక దోషాలు తొలగిపోతాయి. అయితే ఆర్ధికపరమైన సమస్యే అన్నింటికన్నా పెద్ద సమస్య గనుక, దానిలో నుంచి బయటపడే మార్గం గురించే ప్రతి ఒక్కరూ ఆలోచిస్తుంటారు.

ఈ నేపథ్యంలో సంపాదన పెరగాలని కొంతమంది అనుకుంటే, సంపాదించినది నిలిస్తేచాలు అని మరికొందరు అనుకుంటూ వుంటారు. ఈ రెండూ జరగాలంటే పూజా మందిరంలో 'దక్షిణావర్త శంఖం' వుండాలని శాస్త్రం చెబుతోంది. ఈ శంఖాన్ని నియమనిష్ఠలతో పూజించాలని అంటోంది. కుడివైపు నుంచి తెరుచుకుని కనిపించే ఈ దక్షిణావర్త శంఖం సముద్రాలలో అరుదుగా మాత్రమే లభిస్తుంది.

లక్ష్మీదేవి స్వరూపంగా ... లక్ష్మీదేవి నివాస స్థానంగా చెప్పబడుతోన్న ఈ శంఖం, శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ శంఖం ఎక్కడైతే వుంటుందో అక్కడ శ్రీమహాలక్ష్మి స్థిరంగా వుంటుంది. ఎవరైతే ఈ శంఖాన్ని పూజా మందిరంలో వుంచి పూజిస్తారో వారిని ఆమె అనతికాలంలోనే అనుగ్రహిస్తుంది. ఫలితంగా దారిద్ర్యం కారణంగా కలిగే దుఃఖం దూరమవుతుంది.

శంఖంలో పోస్తేనే తీర్థమవుతుందని అంటారు. శంఖంలో పోసిన తీర్థాన్ని స్వీకరించడం వలన అనేక వ్యాధులు నశిస్తాయి. శంఖంలోని నీళ్లను బిందెలోని నీళ్లతో కలిపి స్నానం చేయడం వలన శరీర సంబంధమైన అనేక వ్యాధులు నివారించాబడతాయని ఆయుర్వేదం చెబుతోంది. 'దక్షిణావర్త శంఖం' పూజా మందిరంలో వుంటే చాలు, ఆరోగ్యం ... ఐశ్వర్యం స్థిరంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.


More Bhakti News