రత్నాల దొంగలను వెంటాడిన నంది !

మహర్షుల తపస్సుకు మెచ్చి .. వారి అభ్యర్థన మేరకు పరమశివుడు అనేక ప్రాంతాల్లో లింగరూపంలో ఆవిర్భవించాడు. అలా సదాశివుడు వెలసిన ప్రతిచోటా ఆయనకి ఎదురుగా నందీశ్వరుడు కొలువుదీరి కనిపిస్తుంటాడు. శిలా రూపంలో కనిపించే నందీశ్వరుడు, అనుక్షణం స్వామివారి క్షేత్రాన్ని పర్యవేక్షిస్తూ వుంటాడు. ఈ నేపథ్యంలో నందీశ్వరుడు చేసిన మహిమలు ఎన్నో అక్కడి స్థలపురాణాలుగా వినిపిస్తుంటాయి.

ఈ జాబితాలో గుంటూరు జిల్లా 'నందివెలుగు' కూడా ఒకటిగా కనిపిస్తుంది. ఇక్కడ అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం అత్యంత విశిష్టమైనదిగా చెప్పబడుతోంది. కాలక్రమంలో ఇది చాళుక్యరాజు విష్ణువర్ధనుడి కంటపడుతుంది. ఆయన ఈ శివలింగం ఎదురుగా నందీశ్వరుడినీ ... గణపతిని ప్రతిష్ఠింపజేశాడు. వినాయకుడి బొజ్జలోను ... నంది కొమ్ములలోను రత్నాలను ఉంచాడు.

సూర్యుడి కిరణాలు వినాయకుడి బొజ్జలో గల రత్నలపైపడి, ఆ కాంతి కిరణాలు నంది కొమ్ములపైకి ప్రసరించేవి. అక్కడ పరావర్తనం చెందిన కిరణాలు శివలింగంపై పడేవి. అలా అనునిత్యం స్వామివారికి రత్నాల కిరణాలతో అభిషేకం ... హారతి జరిగేది. అలాంటి పరిస్థితుల్లో కొందరు దోపిడీ దొంగలు వినాయకుడి బోజ్జలోని రత్నాలను ... నంది కొమ్ములు విరిచి అక్కడి రత్నాలను దొంగిలిస్తారు.

అలా వాళ్లు తమ ప్రయత్నం ఫలించిందనే సంతోషంతో తిరిగివెళుతూ వుండగా, విరిచి వేయబడిన నంది కొమ్ములు ఆ దొంగలను వెంటాడటం మొదలుపెడతాయి. భయంతో ఆ దొంగలు తలో దిక్కుకి పరుగులు తీస్తారు. అయినా నంది కొమ్ముల బారినుంచి తప్పించుకోలేక వాటికి బలైపోతారు. ఈ కారణంగానే ఇక్కడి నంది కొమ్ములు లేకుండా కనిపిస్తాడనీ, దెబ్బతిన్న బొజ్జతో వినాయకుడు దర్శనమిస్తూ ఉంటాడని అంటారు.

ఇప్పుడీ క్షేత్రం సాధారణంగా అనిపిస్తూ వున్నా, ఆనాటి మహిమాన్వితమైన సంఘటనకు వేదికగా కనిపిస్తూ వుంటుంది. ఈ కారణంగానే ఈ క్షేత్రం నంది పేరుతో ప్రసిద్ధి చెందింది ... నందీశ్వరుడు ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై వున్నాడనే విశేషాన్ని సంతరించుకుంది.


More Bhakti News