ఇక్కడ సూర్యుడే హారతి పడతాడట !

భగవంతుడు ఆవిర్భవించిన క్షేత్రాలు భక్తుల పాపాలను పటాపంచలు చేస్తుంటాయి. స్వయంభువుగా కొలువుదీరిన దైవాలను సాధారణ మానవులే కాదు, ఇంద్రాది దేవతలు సైతం పూజిస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు, ఆదిదేవుడైన పరమశివుడిని పూజించే క్షేత్రం కూడా మనకి దర్శనమిస్తుంది.

ప్రాచీనకాలంలో తమ జీవనాధారమై ప్రత్యక్షంగా కనిపిస్తోన్న సూర్యుడిని మాత్రమే ప్రజలు ఆరాధించేవారు. అలాంటి సూర్యుడు ... సదాశివుడిని పూజించే క్షేత్రం శ్రీకాకుళం జిల్లా 'పాలకొండ'లో కనిపిస్తుంది. ఈ క్షేత్రంలో స్వామివారు రాజలింగేశ్వరుడుగా .. అమ్మవారు కామాక్షిగా పూజాభిషేకాలు అందుకుంటూ వుంటారు.

ఇక గర్భాలయానికి ముందుగా వినాయకుడు కొలువై వుండటం ... గర్భాలయంలో స్వామి వారి వెనుకగా అమ్మవారు వుండటం ఇక్కడి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ప్రతి రోజు ఉదయాన్నే సూర్య కిరణాలు ముందుగా వినాయకుడిపై ప్రసరించబడతాయి. ఆ తరువాత కొంతసేపటికి శివలింగంపై పడతాయి ... ఆ వెంటనే అమ్మవారిపై పడతాయి. ఇలా గణపతిపై ... శివ పార్వతులపై సూర్యకిరణాలు ప్రసరించే దృశ్యం అద్భుతంగా ఉంటుంది.

ఇలా ఇక్కడి దైవాలపై కిరణాలు ప్రసరించడాన్ని సూర్యుడు చేసే అర్చనగా భక్తులు భావిస్తుంటారు. మనోహరమైన ... మహిమాన్వితమైన ఈ దృశ్యాన్ని చూడటానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ క్షేత్రానికి వస్తుంటారు. ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన సూర్యుడి అనుగ్రహం కూడా లభిస్తుందనీ, గ్రహాలకు నాయకుడైన ఆయన అనుగ్రహాన్ని పొందితే గ్రహ సంబంధమైన బాధలు నశిస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు.


More Bhakti News