రామేశ్వరంలోని జటా తీర్థం ప్రత్యేకత

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెప్పబడుతోన్న రామేశ్వరంలో ఎన్నో విశిష్టమైన తీర్థాలు వున్నాయి. సూర్యతీర్థం .. చంద్రతీర్థం .. శంఖుతీర్థం .. చక్రతీర్థం .. శివతీర్ధం .. గంగా తీర్థం .. యమునా తీర్థం ... సరస్వతీ తీర్థం .. సేతుతీర్థం .. సావిత్రి తీర్థం .. గాయత్రి తీర్థం .. మహాలక్ష్మితీర్థం .. గంధమాదనతీర్థం .. కవచతీర్థం .. నలతీర్థం .. నీలతీర్థం .. గవ్యతీర్థం .. గయతీర్థం .. అమృతతీర్థం .. కోటితీర్థం .. సర్వతీర్థం .. విమోచన తీర్థం .. ఇక్కడ కనిపిస్తాయి.

ఈ తీర్థాలన్నీ కూడా అత్యంత శక్తిమంతమైనవిగా ... మహిమాన్వితమైనవిగా చెప్పబడుతున్నాయి. ఈ తీర్థాలలో స్నానం చేయడం వలన సమస్త పాపాలు నశించి సకల శుభాలు కలుగుతాయని చెప్పబడుతోంది. ఇక వీటికి కాస్త దూరంలో 'జటా తీర్థం' దర్శనమిస్తుంది. ఈ జటా తీర్థం మరింత ప్రత్యేకతను ... విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. రావణుడిని వధించిన శ్రీరాముడు ... సీతా సమేతంగా అయోధ్యకి బయలుదేరుతాడు. అప్పుడు ఈ ప్రదేశానికి చేరుకున్న రాముడు, ఇక్కడి తీర్థం యొక్క పవిత్రతను గుర్తించి ఆగాడట.

ఈ తీర్థంలోని నీటిని ముందుగా తన జటలపై చల్లుకుని, ఆ తరువాత ఇందులో స్నానం చేశాడు. ఆ తరువాత ఇక్కడి శివయ్యను పూజించాడని స్థలపురాణం చెబుతోంది. ఈ తీర్థంలో స్నానం చేయడం వలన కష్టాలు కరిగిపోతాయనీ, సమస్యలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తూ వుంటారు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ఈ తీర్థంలోని పవిత్ర జలాలతో తన జటలను తడుపుకున్న కారణంగా ఈ తీర్థానికి 'జటా తీర్థం' అనే పేరు వచ్చింది. ఆనాటి నుంచి ఈ తీర్థం అశేష భక్త జనులకు దర్శనీయమై ... పూజనీయమై అలరారుతోంది.


More Bhakti News