మహాదేవుడి క్షేత్రంలో మహిమలు

శ్రీమహావిష్ణువు ధరించిన రామావతారం...పరశురామావతారం రెండూ కూడా విశిష్టమైనవిగా చెప్పబడుతున్నాయి. రావణ సంహారం కారణంగా కలిగిన పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి రాముడు, క్షత్రియ సంహారం కారణంగా కలిగిన పాపాన్ని కడిగివేసుకోవడానికి పరశురాముడు అనేక ప్రాంతాల్లో శివలింగాలను ప్రతిష్ఠించారు. అవన్నీ కూడా నేడు దివ్య క్షేత్రాలుగా ... మహిమాన్వితమైన క్షేత్రాలుగా భక్తులను అనుగ్రహిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో పరశురాముడు చివరిగా ప్రతిష్ఠించిన శివలింగం మనకి నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి సమీపంలో గల గుట్టపై కనిపిస్తుంది. ఇక్కడి స్వామి పార్వతీజడల రామలింగేశ్వరుడిగా పూజలు అందుకుంటూ ఉంటాడు. ఇది పరశురాముడు ప్రతిష్ఠించిన 108 వ శివలింగం కావడం ... ఈ శివలింగంపై జడను పోలిన చారలు వుండటం ... శివాంశ సంభూతుడిగా చెప్పబడుతోన్న హనుమంతుడు క్షేత్రపాలకుడు కావడం ఇక్కడి ప్రత్యేకతలుగా చెబుతుంటారు.

ఇక విశేషమైన పర్వదినాల్లో ఇక్కడి స్వామికి ఒక నాగుపాము ప్రదక్షిణలు చేసి వెళుతుంటుందట. ఇది రహస్యంగా చెప్పుకునే విషయమేమీ కాదు, ఆ సమయంలో నాగుపామును చూసిన భక్తులు కూడా ఎంతోమంది వున్నారు. ఈ గుట్టపై భాగంలో 'మూడుగుండ్లు' గా పిలవబడే అతిపెద్ద బండరాళ్లు మూడు కనిపిస్తూ వుంటాయి. ఈ బండరాళ్లు ప్రత్యేకంగా పేర్చినట్టుగా మూడువైపులా వుంటాయి. ఈ రాళ్ల మధ్యలో మరో శివలింగం వుంటుంది. దగ్గరికి వెళ్లి ఈ శివలింగాన్ని దర్శించుకోవడం కష్టసాధ్యమైన విషయం.

ఇక్కడి శివలింగానికి రక్షణగా హనుమంతుడే ఈ బండరాళ్లను చుట్టూ ఉంచాడని చెప్పుకుంటూ వుంటారు. భూత ప్రేతాలు ఆవహించిన వారిపై ఇక్కడ 'హనుమంతుడి పాదుకలు' వుంచి, వారిని మామూలు మనుషులను చేస్తుంటారు. ఇన్ని మహిమలకు వేదికగా నిలిచినందుకే ఈ క్షేత్రం అనూహ్యమైన రీతిలో అభివృద్ధి చెందుతూ వస్తోంది. భక్తులపాలిట కల్పతరువులా విలసి ల్లుతోంది.


More Bhakti News