ఆపదలను తొలగించే అందాల రాముడు

కష్టాలు ఎదురైనప్పడు ఎంత నిబ్బరంగా ఉండాలనేది రామచంద్రుడి జీవితం చెబుతుంది. రాజ్యమును ... రాచరిక వైభవాలను ... తల్లిదండ్రులను ... అనునిత్యం తన క్షేమాన్ని ఆశించే ప్రజలను ... అనుక్షణం తనని ఆరాధించే భార్యను .. విధి దూరం చేసినా ఆయన అధైర్య పడలేదు. శత్రువులను ఎదురించి విజయాన్ని సాధించడంలో ధర్మం తప్పలేదు.

అందుకే రాముడు పురుషోత్తముడైనాడు. కోదండరాముడిగా ... సీతారాముడిగా పిలవబడుతూ ప్రతి గుండెను గుడిగా మలచుకున్నాడు. ఇంటింటికీ ఇలవేల్పై నిత్య నీరాజనాలు అందుకుంటున్నాడు. సీతారాముల ఆదర్శం కారణంగానే నేటికీ వాళ్ల ఆలయాలు వైభవంగా వెలుగొందుతున్నాయి. అలాంటి విశిష్టమైన క్షేత్రాల్లో ఒకటిగా 'తూర్పు యడవల్లి' గ్రామం అలరారుతోంది. వేంకటేశ్వరస్వామి క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన 'ద్వారకా తిరుమల' కు సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది.

దాదాపు ఎకరం విస్తీర్ణం గల ప్రదేశంలో ఈ ఆలయం కనిపిస్తుంది. అడుగడుగునా ... అణువణువునా శిల్పకళను సంతరించుకున్న ఈ ఆలయం భక్తుల మనసును భారీగానే దోచుకుంటుంది. ముఖమంటపం స్తంభాలకు గల నగిషీలు, మంటపం లోపలి పైభాగంలో ద్వాదశ రాశి చిత్రాల ఏర్పాటు ఆశ్చర్యచకితులను చేయకమానదు. గర్భాలయంలో సీతారాముల ప్రతిమలు ప్రశాంతతకు ... పవిత్రతకు ... సౌందర్యానికి ప్రతీకలుగా కనిపిస్తూ వుంటాయి.

అందాల రాముడిని అలాగే చూస్తూ ఎంతసేపైనా అక్కడే కూర్చోవాలనిపిస్తుంది. ఇక్కడి స్వామిని దర్శిస్తే ఆపదలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తూ వుంటారు. పరివార దేవతలతో విరాజిల్లుతోన్న ఇక్కడి సీతారాములను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటూ వుంటారు. శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ జరిగే ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్గొంటూ వుంటారు.


More Bhakti News