కాటన్ దొర కలలో కనిపించిన అమ్మవారు !

కలలో దైవం కనిపించిందనీ ... ఫలానా విషయాన్ని గురించి చెప్పిందని ఎవరైనా అంటే, మిగతా వాళ్లు ఆశ్చర్యపోతారు. కలలో దైవం కనిపించడం ... చేయవలసిన ఒక పనిని గురించి చెప్పడం మామూలు విషయం కాదు. మహా భక్తులకు ... సమాజాన్ని భక్తి మార్గంలో నడిపించడానికి నడుంబిగించిన వాళ్లకి మాత్రమే ఇలాంటి అనుభవం కలుగుతుందని అనుకుంటారు.

అలాంటిది ఒక ఆంగ్లేయ అధికారికి అమ్మవారు కలలో కనిపించి, ఆయన నిర్ణయాన్ని మార్చివేసిందంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. అలాంటి అరుదైన సంఘటన తూర్పు గోదావరి జిల్లా వానపల్లిలోని 'పళ్ళాలమ్మ' క్షేత్రంలో జరిగిందని అంటారు. సాక్షాత్తు సీతమ్మవారు వనవాసకాలంలో ఇక్కడి అమ్మవారిని ప్రతిష్ఠించిందని స్థలపురాణం చెబుతోంది. పరిసర గ్రామస్తులంతా కూడా పళ్ళాలమ్మను తమ ఇలవేల్పుగా భావించి పూజిస్తూ ఉంటారు.

మొదట్లో ... ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మాణం ఈ ప్రాంతం మీదుగా చేపట్టాలని కాటన్ దొర నిర్ణయించుకున్నాడట. అందుకు అడ్డుగా వున్న అమ్మవారి మందిరాన్ని పక్కకి తొలగించడానికి రంగాన్ని సిద్ధం చేశాడు. ఆ రాత్రి అమ్మవారు ఆయన కలలో కనిపించి తన ఆలయాన్ని తొలగించడం వలన కరవు కాటకాలు ఏర్పడతాయని చెప్పిందట. అలా జరగకుండా బ్యారేజ్ నిర్మాణం ఎక్కడి నుంచి ఎలా ప్రారంభించాలో వివరించింది. ఆమె ఆదేశానుసారమే ... ఆ దిశలోనే కాటన్ దొర బ్యారేజ్ నిర్మాణం పూర్తిచేశాడని అంటారు.

ఇక వనవాస కాలంలో ఈ ప్రదేశంలో విడిది చేసిన సీతారాములకు నక్కలు నిద్రాభంగం కలిగించేవట. దాంతో పార్వతీదేవి ఆ నక్కల గుంపులను తరిమికొట్టిందట. గ్రామస్తుల రక్షణకు గాను అక్కడే వుండిపోవలసినదిగా సీతమ్మవారు కోరడంతో, పార్వతీదేవియే పళ్ళాలమ్మగా అక్కడ ఆవిర్భవించిందని చెబుతారు. మహిమాన్వితమైన ఈ సంఘటనలకు వేదికగా నిలిచిన ఈ క్షేత్రాన్ని దర్శించడం మరువలేని అనుభూతిని కలిగిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.


More Bhakti News