అహంకారానికి తగిన అవమానం !

భగవంతుడి అనుగ్రహాన్ని సంపాదించిన జ్ఞానదేవుడుని అక్కడి ప్రజలు నడిచే దైవంగా భావిస్తుంటారు. ఆయన పేరు ప్రతిష్ఠలు దశదిశలా వ్యాపిస్తాయి. దాంతో ఆయన స్వస్థలమైన 'ఆళంది' గ్రామవాసులు ఆయనని వెదుక్కుంటూ వస్తారు. ఆయన పాదస్పర్శచే తమ గ్రామాన్ని పావనం చేయమని కోరతారు. దాంతో ఆయన తన జన్మస్థలమైన ఆళంది పట్ల గల ప్రేమతో తన సోదరులతో కలిసి అక్కడికి చేరుకుంటాడు.

ఇది నచ్చని కొందరు అక్కడికి సమీపంలో గల 'చాంగదేవుడు' అనే యోగీశ్వరుడిని కలుసుకుంటారు. అనేక మంత్ర శక్తులు తన అధీనంలో ఉన్నాయనే గర్వంతో ఆ యోగీశ్వరుడు వ్యవహరిస్తుంటాడు. ఆళంది నుంచి వచ్చిన కొంతమంది దుష్టులు జ్ఞానేశ్వరుడితో ఆయనని పోలుస్తూ రెచ్చగొడతారు. దాంతో వారి మాటలు ఆయనపై ప్రభావం చూపుతాయి. తన మంత్ర బలాన్ని జ్ఞానదేవుడికి చూపించాలనే ఉద్దేశంతో ఆయన పులిపై ఆళంది గ్రామానికి బయలుదేరుతాడు. చాంగదేవుడి పరివారమంతా కూడా హడావిడి చేస్తూ ఆయనని అనుసరిస్తారు.

ఆ సమయంలో .. ఓ పాడుబడిన గోడపై కూర్చుని తన సోదరులతో ఆధ్యాత్మిక పరమైన విషయాలను గురించి జ్ఞానదేవుడు ముచ్చటిస్తూ వుంటాడు. తన శక్తిని పరీక్షించడానికి అహంభావంతో చాంగదేవుడు పులిపై వస్తున్నట్టుగా జ్ఞానదేవుడికి తెలుస్తుంది. ఆ యోగీశ్వరుడి అహంకారాన్ని అణచాలనే ఉద్దేశంతో, ఆయనకి ఎదురు వెళ్లవలసిందిగా తాను కూర్చున్న పాత గోడను ఆజ్ఞాపిస్తాడు. అంతే ఆ పిట్టగోడ హంసలా గాలిలోకి ఎగురుతూ ముందుకు దూసుకుపోతూ వుంటుంది.

ఈ వింతని చూసిన వాళ్లంతా ఆనందాశ్చర్యాలకి లోనవుతారు. ఆకాశమార్గాన గోడపై ప్రయాణం చేస్తూ తన ముందుకి వచ్చిన జ్ఞానదేవుడిని చూసి చాంగదేవుడు నివ్వెరపోతాడు. ఆయన పరివారమంతా కూడా ఎక్కడి వాళ్లు అక్కడ కొయ్యబారిపోతారు. జ్ఞానదేవుడు పాత గోడను వాహనంగా చేసుకుని రావడంతోనే ఆయన శక్తి సామర్థ్యాలు ఎంతటివో చాంగదేవుడికి అర్థమైపోతుంది. చెప్పుడు మాటలు విని అహంభావంతో ప్రవర్తించినందుకు మన్నించమని కోరతాడు.

జ్ఞానదేవుడిపైకి చాంగదేవుడిని ఉసిగొల్పిన వాళ్లు కూడా తమ తప్పుని క్షమించమంటూ ఆయన పాదాలపై పడతారు. అసూయ ద్వేషాలతో కాలాన్ని వృథా చేసుకోవద్దనీ, అహంభావంతో అధోగతిని పొందవద్దని వాళ్లకి హితవు చెబుతాడు జ్ఞానదేవుడు. ముక్తి మార్గంలోకి ప్రవేశించడానికి భక్తి మార్గంలో మాత్రమే ప్రయాణించవలసి ఉంటుందని చెప్పి అక్కడి నుంచి వెనుదిరుగుతాడు.


More Bhakti News