విశేష ఫలితాలను ప్రసాదించే చైత్ర పౌర్ణమి

నూతన సంవత్సరానికి వేదికగా నిలిచి ... సీతారాముల కళ్యాణోత్సవ వేడుకను కనుల పండుగగా నిర్వహించి చైత్రమాసం తన ఘనతను చాటుకుంటుంది. అలాంటి చైత్రమాసంలో వచ్చే 'పౌర్ణమి' ఎన్నో విశేషాలను సంతరించుకుని అత్యంత విశిష్టమైనదిగా చెప్పబడుతోంది. ఈ రోజున శివపార్వతుల కల్యాణం జరిపించడం వలన పుత్ర సంతానం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

పుత్రకామేష్ఠి యాగం చేసిన దశరథ మాహారాజు ఈ రోజున పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని కూడా జరిపించినట్టు తెలుస్తోంది. కౌసల్య గర్భాన శ్రీరాముడు జన్మించడం వెనుక, పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం వుందని చెబుతుంటారు. ఆనాటి నుంచి సంతానాన్ని ఆశించేవారు ఈ రోజున పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరించడం ఆనవాయతీగా వస్తోంది. ఇక శివుడి యొక్క అంశగా చెప్పబడుతోన్న హనుమంతుడు ఈ రోజునే జన్మించాడని ఉత్తర భారతీయులు భావిస్తుంటారు.

అందువలన ఈ రోజున అత్యంత ఉత్సాహంతో 'హనుమజ్జయంతి' జరుపుకుంటూ వుంటారు. అక్కడి హనుమంతుడి ఆలయాలు ఈ రోజున భజనలతో మారుమోగి పోతుంటాయి. శ్రీశైల మల్లన్నే తన భర్త అని చెప్పి అశేష ప్రజానికాన్ని ఆశ్చర్యచకితులను చేసిన 'అక్కమహాదేవి' ఈ రోజునే జన్మించినట్టుగా చెప్పబడుతోంది. శ్రీశైలంలో గల అక్కమాహదేవి గుహలను దర్శిస్తే, భక్తి మార్గంలో ఆమె అనుసరించిన విధివిధానాలు ఎంతటి కఠినతరమైనవో అర్థమవుతుంది.

కన్నడ భక్తి సాహిత్యాన్ని తనదైన శైలిలో ప్రభావితం చేసిన అక్కమహాదేవిని వీరశైవులు ఎంతగానో ఆరాధిస్తూ, ఆమె జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకున్న చైత్రపౌర్ణమి రోజుని ఆధ్యాత్మిక చింతనతో గడపడం వలన అనంతమైన ఫలితాలు లభిస్తాయనే విషయాన్ని మరిచిపోకూడదు.


More Bhakti News