తీర్థం

దేవాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోగానే తీర్థ ప్రసాదాలు తీసుకుంటూ వుంటాం. పూజ పూర్తి అయిన తరువాత, ఆలయంలోని ప్రధాన దైవానికి సంబంధించిన మంత్రాన్ని చదువుతూ అర్చక స్వామి తీర్థం ఇస్తాడు. కుడి అరచేతిని 'ఆవుచెవి'ఆకారంలో మడిచి తీర్థం తీసుకోవడం జరుగుతుంది. అయితే చాలామంది తీర్థం తీసుకున్న తరువాత ఆ తడి చేతిని తలకి రాసుకుంటూ వుంటారు. ఈ విధంగా చేయడం ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్య పరంగా కూడా మంచిది కాదని పెద్దలు చెబుతుంటారు.

పంచామృతాలతో చేయబడిన తీర్థమే అయినా ... తులసి తీర్థమే అయినా అది స్వీకరించిన తరువాత ఎంగిలి చేతిని తలకి రాసుకోకూడదని శాస్త్రం చెబుతోంది. ఈ విధంగా చేయడం వలన ఆ తరువాత అర్చక స్వామి తలపై పెట్టే శఠగోపానికి (స్వామివారి పాదుకలకి ) ఆ ఎంగిలి అంటుతుంది. దాని కారణంగా అపచారం చేసినట్టు అవుతుంది.

అందువలన తీర్థం తీసుకున్న తరువాత వెంటనే చేతిని నీటితో కడగాలే తప్ప తలకి రాసుకోకూడదు. దేవాలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే శరీరం ... దైవదర్శనం వలన మనసు ... తీర్థం స్వీకరించడం వలన దేహంలోని లోపలి భాగాలు పవిత్రమవుతాయి.


More Bhakti News