లేపాక్షి బసవయ్య చూపే మహిమ !

లేపాక్షి పేరు వినగానే భారీ ఆకారం గల నందీశ్వరుడు కళ్లముందు కదలాడుతుంటాడు. ఇక్కడి బసవన్న8.1 మీటర్ల పొడవు ... 4.5 మీటర్ల ఎత్తు కలిగి, జీవం ఉట్టిపడుతూ కనిపిస్తుంటాడు. పరమశివుడి ఆదేశం కోసం ఎదురుచూస్తూ ఉన్నట్టుగా ఈ బసవయ్య కనిపిస్తూ వుంటాడు. విశిష్టమైనటువంటి శైవ క్షేత్రాల్లో ఒకటిగా విలసిల్లుతోన్న ఈ క్షేత్రంలో సదాశివుడిని ఎంతగా పూజిస్తూ ఉంటారో, బసవన్నను అంతగా ఆరాధిస్తూ వుంటారు.

శ్రీరామచంద్రుడు కారణంగా ఈ క్షేత్రానికి ఈ పేరు రావడం ... పరమశివుడు ఇక్కడ ఆవిర్భవించడం ... బసవన్నకు యుగాంతంతో ముడిపడి ఉండటం వలన ఈ క్షేత్రం అత్యంత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. ఇక్కడి బసవయ్య మహిమాన్వితుడని భక్తులు చెబుతుంటారు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లోని పశువులను బసవయ్య కాపాడుతూ ఉంటాడని అందరూ విశ్వసిస్తూ ఉంటారు. పశువులు అనారోగ్యం పాలైనప్పుడు, వాటి క్షేమాన్ని కోరుతూ యజమానులు బసవయ్య దగ్గర దీపారాధన చేస్తుంటారు. తమ పశువులను రక్షించమని మొక్కుకుంటూ వుంటారు.

ఈ విధంగా బసవయ్యను ఆరాధించిన అనతికాలంలోనే పశువులు తిరిగి ఆరోగ్యాన్ని పొందుతుండటం విశేషం. బసవయ్య అనుగ్రహం కారణంగానే తమ పశువులు కోలుకున్నాయని అనుభవపూర్వకంగా చెప్పే వాళ్లు ఎంతోమంది ఇక్కడ కనిపిస్తూ వుంటారు. ఈ క్షేత్రంలో బసవయ్య ప్రత్యక్షంగా కొలువుదీరి ఉన్నాడనీ, అందుకు ఈ మహిమే నిదర్శనమని భక్తులు చెప్పుకుంటూ ఉంటారు.


More Bhakti News