పూజా మందిరంలో ఏవి ఉండకూడదు ?

ఆధ్యాత్మిక చింతన కలిగిన ప్రతి ఇంట్లోను పూజా మందిరంగానీ, పూజగది కాని తప్పనిసరిగా ఉంటుంది. పూజా మందిరాలలో కులదేవతల చిత్రపటాలు ... ఇష్టదేవతల ప్రతిమలు దర్శనమిస్తూ ఉంటాయి. తమని ఫలానా దేవుడు ఆపద నుంచి రక్షించాడనో ... అవసరంలో ఆదుకున్నాడనో అనిపించినప్పుడు ఆయా దేవతల చిత్రపటాలు కూడా పూజా మందిరంలోకి వచ్చి చేరుతుంటాయి.

ఇష్టపడి కొన్నవి కొన్ని ... ఎవరో కానుకగా ఇచ్చారని కొన్ని పూజా మందిరంలోకి చేరుస్తుంటారు. ఈ నేపథ్యంలో పూజా మందిరంలో రెండు శివలింగాలు ... రెండు సాలగ్రామాలు ... రెండు శంఖాలు కనిపిస్తుంటాయి. అయితే ఇవి పూజా మందిరంలో రెండేసి ఉండకూడదని శాస్త్రం చెబుతోంది. ఒకటికి మించి ఇవి పూజా మందిరంలో ఉండటం వలన ఫలితంలో ఎలాంటి మార్పు ఉండదు. పైగా దోషం సంక్రమించే అవకాశం లేకపోలేదు.

ఇక కొంతమంది పూజ గదిలోని దైవ ప్రతిమలు దెబ్బతిన్నా వాటిని అక్కడి నుంచి తీయడానికి ఇష్టపడకుండా అలాగే పూజ చేస్తుంటారు. ముచ్చటపడి కొన్నవి కావడం వలన వదులుకోలేక పోతున్నామని చెబుతుంటారు. ఈ విధమైన ఆలోచన సరైనది కాదనీ, లోపం ఏర్పడిన విగ్రహాలను వెంటనే నిమజ్జనం చేయాలని శాస్త్రం స్పష్టం చేస్తోంది. ఇక మరికొందరు పూజా మందిరం పైభాగంలో పూజకి సంబంధించిన వస్తువులు పెడుతుంటారు. పారాయణం చేసే పుస్తకాలు ... అష్టోత్తర సహస్ర నామాల పుస్తకాలు ... అగ్గి పెట్టెలు ... అగరొత్తులు ... కుందులు పెట్టేస్తుంటారు.

పూజా సమయంలో అవసరమైనవి అందుకోవడానికి వీలుగా ఉంటాయని వీళ్లు భావిస్తుంటారు. కానీ పూజా మందిరంపై ఎలాంటి వస్తువులు పెట్టకూడదు. భగవంతుడి శిరస్సు పైభాగం కనుక అక్కడ ఏమీ పెట్టకూడదని చెప్పబడుతోంది. పూజా మందిరానికి సంబంధించి ఈ నియమాలను పాటించడం వలన, దోషరహితమైన ఫలితం లభిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


More Bhakti News