దీపారాధనలో ఏ నూనె వాడకూడదు ?

శుభకార్యమైనా ... దైవ కార్యమైనా దీపారాధనతోనే మొదలవుతుంది. దీపం ... జ్యోతి స్వరూపుమైన దైవాన్ని సూచిస్తుంది. దైవం ఎక్కడ వుంటే అక్కడ శుభమే జరుగుతుంది. దీపం ... తన చుట్టూ వున్న చీకటిని తరిమివేయడమే కాకుండా, ఆ చీకటిని ఆశ్రయించి వున్న అనేక దుష్టశక్తులను పారద్రోలుతుంది. అక్కడి వాతావరణాన్ని కాంతివంతంగా ... ప్రశాంతంగా మార్చివేస్తుంది.

ఈ కారణంగానే ప్రతి శుభకార్యం దీపారాధనతోనే మొదలవుతుంది. ఇక ఈ దీపారాధనకి ఏ నూనెను ఉపయోగించాలనే విషయంలో ఎవరికి తెలిసినది వాళ్లు ... ఎవరికి తోచింది వాళ్లు చెబుతుంటారు. దీపారాధనకిగాను కొంతమంది నెయ్యి వాడుతుంటారు ... మరి కొందరు నువ్వులనూనె వాడుతుంటారు. ఇంకొందరు వేరుశనగ నూనె ఉపయోగిస్తూ ఉంటారు. ఇక దీపారాధనకి తాము వాడే నూనె ఏదో కూడా తమకే తెలియనివాళ్లు కూడా లేకపోలేదు.

భగవంతుడి సన్నిధిలో చేసే దీపారాధనను ఒక్కో నూనెతో చేయడం వలన ఒక్కో ఫలితం ఉంటుంది. అందువలన ఏ నూనెతో దీపారాధన చేయాలనే విషయాన్ని తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది. నెయ్యితోను ... నువ్వుల నూనెతోను మాత్రమే దీపారాధన చేయాలి. నెయ్యితో దీపారాధన చేయడం వలన జ్ఞానం వికసిస్తుంది ... నువ్వులనూనె ఉపయోగించడం వలన సంపదలు నిలుస్తాయి.

ఇక ఈ రెండు నూనెలు అందుబాటులో లేని పరిస్థితుల్లో మాత్రమే వేరుశనగ నూనెను వాడవలసి వుంటుంది. ఆముదాన్ని గానీ ... వేపనూనెను గాని దీపారాధనకు ఉపయోగించడం వలన అనేక దోషాలను మూటగట్టుకోవలసి వస్తుంది. అందువలన వాటిని వాడకపోవడమే అన్నివిధాలా మంచిదని గ్రహించాలి.


More Bhakti News