స్వప్నంలో సాక్షాత్కరించే రాముడు

శ్రీరాముడి నామాన్ని సదా స్మరించే వాళ్లు ఆయన నామం మధురమైనదని చెబుతారు. ఆ సాకేత రాముడిని ప్రత్యక్షంగా దర్శించిన వాళ్లు ఆయన రూపం మనోహరమైనదని చెబుతారు. కోదండరాముడు కోర్కెలు నెరవేర్చడంలో ముందుంటాడని ఆయన అనుగ్రహాన్ని పొందిన వాళ్లు అంటారు. ఇలా శ్రీరాముడితో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకున్న భక్తులు ఆయన కల్యాణాన్ని తిలకించి తరించడానికి భద్రాచలం క్షేత్రానికి పెద్ద సంఖ్యలో వెళుతూ ఉంటారు.

అంగరంగ వైభవంగా ఇక్కడ జరిగే కళ్యాణ మహోత్సవానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. సీతారాముల వైభవాన్ని తిలకించేందుకు ఈ దివ్య క్షేత్రానికి తొలిసారిగా వచ్చేది కొందరైతే, స్వామికి మాట ఇచ్చిన కారణంగా వచ్చేది మరికొందరు. భక్తుడి అభ్యర్థన వలన రాములవారు ఇక్కడ ఆవిర్భవించి, భక్తుడు నిర్మించిన ఆలయంలో కొలువైన కారణంగా ఆయన భక్తుల పక్షపాతిగా ప్రసిద్ధి చెందాడు. ఈ కారణంగానే సంతానలేమితో బాధపడుతున్న వాళ్లు ... వివాహం ఆలస్యమై ఆవేదన చెందుతున్న వాళ్లు ... అనారోగ్యంతో అలమటిస్తున్న వాళ్లు ఇక్కడి రాముడిని ఆశ్రయిస్తారు. తమ మొరను ఆలకించమంటూ ఈ క్షేత్రంలో మూడురోజుల పాటు నిద్రచేస్తారు.

కరుణా సముద్రుడైన రాముడు భక్తులకు స్వప్నంలో కనిపించి వారి కోరికలు నెరవేర్చనున్నట్టు చెబుతాడట. ఇక అనారోగ్యంతో బాధపడుతోన్న వాళ్లకు స్వప్నంలో దర్శనమిచ్చి ఆప్యాయంగా వారి శరీరాన్ని నిమురుతాడట. దుష్ట ప్రయోగాల కారణంగా ... గ్రహపీడల కారణంగా బాధలు పడేవారికి స్వప్నంలో దర్శనమిచ్చి కొరడాతో కొడతాడట. ఫలితంగా అనతికాలంలోనే వాళ్లు మామూలు స్థితికి వస్తున్నట్లు ఇక్కడి వాళ్లు చెబుతుంటారు. తమ అనుభవాలను స్వయంగా చెప్పుకునే వాళ్లు కూడా ఇక్కడ కనిపిస్తారు.

ఇలా స్వామి అనుగ్రహానికి పాత్రులైన వాళ్లంతా, తమ కుటుంబసభ్యులతో కలిసి ప్రతి ఏటా ఇక్కడ జరిగే కళ్యాణ మహోత్సవానికి వస్తామని మొక్కుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్లు ఎందరో ఈ స్వామి కల్యాణానికి తరలివస్తుంటారు. ఈ మొక్కుబడులలో భాగంగానే స్వామివారి సన్నిధిలో అన్నప్రాశనలు .. అక్షరాభ్యాసాలు .. ఉపనయనాలు .. వివాహాలు విరివిగా జరుగుతుంటాయి. ఇందులో భాగంగానే స్వామివారికి నిత్య కళ్యాణాలు నిర్వహించబడుతూ ఉంటాయి.


More Bhakti News