కొండ పొడవునా భగవంతుడి పాదముద్రలు

భగవంతుడి పాదాలను ఆశ్రయించమనే సమస్త పురాణాలు చెబుతున్నాయి. భగవంతుడి పాదాలను స్పర్శించినంత మాత్రాన్నే పాపాలు పటాపంచలై, పుణ్యఫలాలు చెంతచేరుతాయి. మానవుడి జీవితానికి అర్థాన్ని ... పరమార్థాన్ని ఇచ్చేవి, మోక్షాన్ని ప్రసాదించేవి భగవంతుడి పాదాలేనని భక్తులు విశ్వసిస్తుంటారు. అందుకే దేవుడు గర్భాలయంలో వుంటే భక్తుల చూపు ఆయన పాదాలపై ఉంటుంది. దేవుడు ఏ చెట్టుకిందో వెలుస్తే భక్తులు తమ శిరస్సుతో భగవంతుడి పాదాలను తాకుతుంటారు.

భగవంతుడి పాదముద్రలు ఆయా క్షేత్రాల్లో కనిపిస్తూనే ఉంటాయి. సాధారణంగా ఆయా క్షేత్రాల్లో భగవంతుడిదిగా చెప్పబడుతోన్న పాదముద్ర ఒకటి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. రెండవ పాదముద్ర అక్కడికి సమీపంలో గల మరో కొండపై ఉండి వుంటుందని భక్తులు అనుకుంటూ ఉంటారు. మరి కొన్ని క్షేత్రాల్లో పాదముద్రలు జంటగా దర్శనమిస్తుంటాయి. ఈ పాదముద్రలపై పుష్పాలను ఉంచుతూ భక్తులు నమస్కరిస్తూ ఉంటారు.

అయితే భగవంతుడి పాదముద్రలు ఒకటి ... రెండు కాకుండా కొండ కిందిభాగం నుంచి పై భాగం వరకూ కనిపించే క్షేత్రం ఒకే ఒకటి ఉంది ... అదే 'మన్యంకొండ'. పరమపవిత్రమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో విలసిల్లుతోంది. ఈ కొండ ... తిరుమలకొండకు నమూనాలా అనిపిస్తూ ఉంటుంది. కొండ దిగువున అమ్మవారి ఆలయం ... కొండపై భాగంలో స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు. సహజసిద్ధంగా ఏర్పడిన కోనేరులో భక్తులు స్నానాలు చేస్తుంటారు.

స్వామివారు ఈ కొండపైకి వచ్చిన దారి అంతటా కూడా ఆయన పాదముద్రలు ఉండటం ఇక్కడి విశేషం. ఈ పాదముద్రలను చూడగానే అవి సహజంగా ఏర్పడినవే కానీ, ప్రచారం కోసం చెక్కినవి కావు అనే విషయం స్పష్టంగా అర్థమైపోతుంది. కొండపైకి చేరుకోవడానికి మరో మార్గం ఉన్నప్పటికీ, స్వామివారి పాద ముద్రలను స్పర్శించడం కోసం కొంతమంది ఈ దారిలో వస్తుంటారు.

ఈ పాదముద్రలకు నమస్కరించుకోవడం వలన, స్వామివారిని ప్రత్యక్షంగా సేవించిన ఫలితం కలుగుతుందని స్థల పురాణం చెబుతోంది. ఒకప్పుడు 'మునులకొండ'గా ... ఇప్పుడు 'మన్యం కొండ'గా పిలవబడుతోన్న మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన సకల శుభాలు చేకూరతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.


More Bhakti News