దైవనికి ఎదురుగా నిలబడవచ్చా ?

పర్వదినాల సమయంలో ఆలయాలకి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక పుణ్యక్షేత్రాలకి భక్తుల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎవరికి వారు సాధ్యమైనంత తొందరగా దైవదర్శనం చేసుకుని బయటపడాలని చూస్తుంటారు. ప్రధానదైవం ఎదురుగా రాగానే స్వామివారికి మనసులో మాట చెప్పుకుని ఆయన అనుగ్రహాన్ని ఆశిస్తూ ముందుకు వెళుతుంటారు.

ఇక మరికొన్ని ఆలయాల్లో వరుసక్రమం పాటించకుండా, అంతా గుంపుగా గర్భాలయానికి ఎదురుగా నుంచుని దైవదర్శనం చేసుకుంటూ ఉంటారు. దేవుడిని సరిగ్గా చూడనీయలేదంటూ ఒకరిపై ఒకరు గొడవకి దిగుతుంటారు. అసలు దేవుడికి ఎదురుగా నిలబడి దర్శనం చేసుకోకూడదని కొందరు చెబుతుంటారు. అలా చేయడం వలన భగవంతుడి ఆధిక్యత పట్ల నిర్లక్ష్య వైఖరిని అనుసరించినట్టు అవుతుందని అంటారు.

గర్భాలయలో స్వామి నేలబారుగా ఉన్నప్పుడు మాత్రమే ఆయనకి ఎదురుగా నుంచో కూడదనీ, స్వామి వేదికపై కొలువుదీరి ఉన్నప్పుడు ఎదురుగా నుంచున్నా దోషం లేదని మరికొందరు చెబుతుంటారు. ఈ విషయంలో ఏది నిజం అనేది పక్కనపెడితే, ప్రధాన దైవానికి ఎదురుగా ప్రధాన సేవకుడు ... ప్రధమ భక్తుడు అయిన వాళ్ల మందిరం ఉంటుంది. వేంకటేశ్వరస్వామికి ఎదురుగా గరుత్మంతుడు ... రాముడికి ఎదురుగా హనుమంతుడు ... శివుడికి ఎదురుగా నంది కొలువై ఉంటారు.

తమ దైవాన్ని క్షణకాలం పాటు కూడా చూడకుండా వీళ్లు ఉండలేరు. భగవంతుడికి ఎదురుగా నుంచోవడం వలన ఆయనకీ సేవకులకు మధ్య అడ్డుగా ఉన్నట్టు అవుతుంది. ఆ విధంగా ఉండటం వారికి కాస్త ఇబ్బందినీ ... బాధను కలిగిస్తుంది. అందువలన భగవంతుడిని గర్భాలయానికి ఒక పక్కగా నుంచుని దర్శించుకోవడమే అన్ని విధాలా మంచిదని చెప్పవచ్చు.


More Bhakti News