శ్రీవారి మనసు దోచుకున్న ప్రదేశం

వైకుంఠంలో పాలకడలిలో శేష తల్పంపై సేదతీరే శ్రీమహావిష్ణువు, ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడై వేంకటేశ్వరుడుగా తిరుమల కొండలపై నివాసాన్ని ఏర్పాటుచేసుకున్నాడు. ఇక్కడి పచ్చదనానికి ... పరిమళాలతో కూడిన గాలికి పరవశిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ ప్రదేశమే కాకుండా మరో ప్రదేశం కూడా కోనేటి రాయుడి మనసు దోచేసిందని చెబుతుంటారు.

శ్రీవారికి అంతగా నచ్చిన ఆ పవిత్రమైన ప్రదేశమే 'మల్లవరం'. ప్రకాశం జిల్లాకి చెందిన ఈ క్షేత్రంలో కొండపై స్వామి ఆవిర్భవించాడు. ఒకసారి ఆకాశమార్గాన విహారానికి బయలుదేరిన వేంకటేశ్వరుడికి, ఈ ప్రదేశం ఎంతగానో నచ్చేసిందట. దాంతో ఇక్కడ కొంతసేపు విశ్రమించాలనుకుని కిందికి దిగబోతాడు. దాంతో అక్కడి కొండలు కంగారుపడిపోయి, జగాలనేలే స్వామి బరువును తాము మోయలేమంటూ నిస్సహాయతను వ్యక్తం చేస్తాయి.

ప్రస్తుతం స్వామి ఆవిర్భవించిన కొండ ముందుకు వచ్చి, తనపై విశ్రాంతి తీసుకోమని కోరుతుంది. దాంతో వేంకటేశ్వరుడు ఇక్కడి కొండపై దిగుతాడు. ఆహ్లాదకరమైన ఇక్కడి ప్రకృతి సౌందర్యం చూసి వేంకటేశ్వరుడు అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన నారద మహర్షి, శ్రీవారు అక్కడ వేంచేయడం గురించి అడుగుతాడు. ఆ ప్రదేశం స్వామివారికి ఎంతగానో నచ్చిందని తెలుసుకుంటాడు.

భక్తుల దర్శనార్థం అక్కడ ఆవిర్భవించమనీ, తన చేతులమీదుగా ప్రతిష్ఠా కార్యక్రమాలు జరిగే భాగ్యాన్ని ప్రసాదించమని కోరతాడు నారదమహర్షి. అందుకు స్వామి అంగీకారాన్ని తెలియజేస్తూ కొండపై శిలా రూపంలో వెలుస్తాడు. అలా ఈ కొండ శ్రీనివాసుడి నివాస ప్రదేశంగా ... ఆయన వేడుకలకు వేదికగా నిలిచింది. ఆనాటి నుంచి ఎంతోమంది మహర్షులు ... మహారాజులు స్వామివారి దర్శనం చేసుకుని పునీతులైనట్టు చెబుతారు.

విజయనగర రాజులు ... ఆ తరువాత వచ్చిన సంస్థానాధీశులు స్వామివారి ఆలయ నిర్మాణానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకున్నట్టుగా ఆధారాలు ఉన్నాయి. విశేషమైన పర్వదినాల్లో ఈ కొండ మరింత సందడిగా కనిపిస్తూ ఉంటుంది. స్వామివారు ఇష్టపడి వెలసిన క్షేత్రం కావడం వలన తమ కష్టాలు కర్పూరంలా కరిగించేస్తాడని భక్తులు నమ్ముతుంటారు. భక్తిశ్రద్ధలతో మొక్కుబడులు చెల్లిస్తూ ఉత్సాహంతో ఉత్సవాల్లో పాల్గొంటూ ఉంటారు.


More Bhakti News