శివకేశవుల పాదముద్రలు ఇక్కడ చూడొచ్చు !

పుణ్యక్షేత్రాలను దర్శిస్తున్నప్పుడు కొన్ని క్షేత్రాల్లో పాదముద్రలు కనిపిస్తుంటాయి. అవి అక్కడి ప్రధానదైవానివనో ... ఆ ప్రాంతం మీదుగా ప్రయాణించిన మరో దైవానివనో చెబుతుంటారు. కొన్ని క్షేత్రాల్లో ఈ పాదముద్రలకు మందిరాలు నిర్మించగా, మరికొన్ని చోట్ల మామూలుగానే పూజలు అందుకుంటూ ఉంటాయి.

ఈ నేపథ్యంలో శైవ క్షేత్రాల్లో శివుడి పాదముద్రలు ... వైష్ణవ క్షేత్రాల్లో విష్ణుమూర్తి పాదముద్రలు కనిపిస్తూ ఉంటాయి. అయితే శివకేశవుల పాదముద్రలు కనిపించే అరుదైన ... అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం ఒకటి ఉంది ... అదే పుష్పగిరి. కడపజిల్లా రాజంపేట సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది.

ఇక్కడి కొండపై రెండు పాదముద్రలు కనిపిస్తుంటాయి. పాదముద్రలు రెండు వేరు వేరు పరిమాణాల్లో ఉండటం వలన ఇవి ఒకరి పాదాలు కావనీ ... ఇద్దరివని చెబుతుంటారు. ఆ ఇద్దరూ శివకేశవులని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. పూర్వం ఇక్కడ మహిమాన్వితమైన ఓ కొలను ఉండేదట. ఆ కొలను కారణంగా మానవుల సాధారణమైన జీవనం దెబ్బతింటుందని శివకేశవులు భావించారు. ఆ కొలను పూడ్చడం కోసం హనుమంతుడితో ఓ కొండను తెప్పించి అందులో వేయించారు.

కొండ సైతం ఆ కొలనులో పువ్వులా తేలిందట. ఈ కారణంగానే ఈ క్షేత్రానికి 'పుష్పగిరి' అనే పేరు వచ్చిందని చెబుతారు. అలా తేలిన కొండ పై శివకేశవులు తమ పాదాలను మోపి లోపలికి అదిమారట. ఈ కారణంగానే ఆ ప్రదేశంలో వారి పాదముద్రలు పడ్డాయని ఇక్కడి స్థలపురాణం చెబుతోంది. ఈ పాదముద్రలను దర్శించిన వారికి శివకేశవులను ప్రత్యక్షంగా పూజించిన ఫలితం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు.


More Bhakti News