బాబా సాక్షాత్తు భగవంతుడే

బాబా సాక్షాత్తూ భగవంతుడేనని శిరిడీ ప్రజలు విశ్వసించేవాళ్లు. అలా వాళ్లు నమ్మడం వెనుక బాబా చూపిన మహిమలు ఎన్నోవున్నాయి. బాబా మశీదులో కూర్చుని ఎక్కడో సముద్రంలో ఓడతోపాటు మునిగిపోతున్న తన భక్తులను కాపాడాడు. అలాగే ధుని దగ్గర కూర్చుని, వేరే ఊళ్లో తల్లి ఒడిలో నుంచి కొలిమిలో పడబోతున్న పసిబిడ్డను రక్షించాడు. తన భక్తుడి కూతురికి కాన్పు కష్టమైనప్పుడు, ఆమెకి సుఖప్రసవం కలిగేలా చేశాడు.

ఇవన్నీ కూడా మిగతా భక్తులకు ఆ తరువాత తెలిశాయి. ఇక అందరూ చూస్తుండగా బాబా తన మహిమను చూపిన సందర్భాలు లేకపోలేదు. తన భక్తుడికి పాము కరిచినప్పుడు విషాన్ని దిగిపొమ్మనడం ... తనతో అంతా కలిసి భోజనానికి కూర్చున్నప్పుడు మశీదు కూలబోవడం వంటి సమయంలో ఆయన మహిమను గురించి శిరిడీ ప్రజలు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఇలా బాబా శక్తి సామర్థ్యాలు ప్రజలకు ప్రత్యక్షంగా అనుభవంలోకి తెచ్చిన మరో సంఘటన ఉంది.

ఒకసారి శిరిడీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీ వర్షం పడవచ్చని అక్కడి వాళ్లు అనుకున్నారు. అయితే భారీ వర్షంతోపాటు విపరీతమైన గాలి ... ఉరుములు ... పిడుగులు మొదలయ్యాయి. చీకటిపడే సమయానికి దాని ఉధృతి మరింత పెరిగింది. దాంతో ప్రజల్లో భయాందోళనలు ఆవరించాయి. పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతూ ఉండటంతో అందరూ కలిసి మశీదులోగల బాబా దగ్గరికి పరిగెత్తుకు వస్తారు. ఆయన మాత్రం మశీదులో ప్రశాంతంగా కూర్చుని ఆకాశంలోని మార్పులను గమనిస్తున్నాడు.

మశీదు చేరుకున్న ప్రజలు బాబా దగ్గర ఆందోళన వ్యక్తం చేస్తారు. గాలివానకు పిల్లలు భయపడుతున్నారనీ, పశువులు తల్లడిల్లిపోతున్నాయని అంటారు. తమని కాపాడవలసిన బాధ్యత ఆయనదేనంటూ నిస్సహాయతను వ్యక్తం చేస్తారు. దాంతో బాబా విసవిసా మశీదు బయటికి వచ్చి ఆకాశం వైపు కోపంగా చూస్తాడు. ఇంతవరకూ చేసిన నష్టం చాలు ... ఇక తగ్గమంటూ మందలిస్తాడు. శిరిడీ తన రక్షణలో ఉందనీ ... వెంటనే వెనక్కితిరిగి వెళ్లమని హెచ్చరిస్తాడు.

అంతే ఒక్కసారిగా ఉరుములు - మెరుపులు తగ్గుముఖం పడతాయి. గాలివాన తన తీవ్రతను తగ్గిస్తూ అక్కడి నుంచి అదృశ్యమవుతుంది. ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన శిరిడీ ప్రజలకు బాబా సాక్షాత్తు భగవంతుడేనని అర్థమవుతుంది. తమ పాలిట ఆ మశీదు గోవర్ధన పర్వతమనీ, బాబా కృష్ణ పరమాత్ముడని భావిస్తూ ఆయన పాదపద్మాలపై కృతజ్ఞతా పూర్వకంగా వాలిపోతారు.


More Bhakti News