అందరినీ ఆదుకునే హనుమంతుడు

సాక్షాత్తు సదాశివుడి అంశావతారంగా ... సూర్యుడి శిష్యుడిగా ... శ్రీరాముడి భక్తుడిగా ఆధ్యాత్మిక ప్రపంచాన్ని హనుమంతుడు ప్రభావితం చేశాడు. మహాపరాక్రమవంతుడైన హనుమంతుడు, సూక్ష్మ ... స్థూల రూపాలను పొందడంలో ఆరితేరినవాడు. పెద్దలలో పెద్దగా ... పిల్లలలో పిన్నగా కలిసిపోతూ అందరినీ ఆకట్టుకున్నవాడు.

భగవంతుడిని ఏ విధంగా సేవించాలో ... ఆయన అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలో తెలియజెప్పడం కోసం తాను భక్తుడిగా మారిన ఘనుడు హనుమంతుడు. ఈ కారణంగానే అటు భగవవంతుడి మనసులోనూ ... ఇటు తన భక్తుల హృదయాలలోనూ ఆయన స్థానం సంపాదించుకో గలిగాడు.

సీతారాముల సన్నిధిలో మాత్రమే కాకుండా ఆయన చాలా గ్రామాల్లో గ్రామ రక్షకుడిగా కనిపిస్తూ ఉంటాడు. అలా కొలువుదీరిన హనుమంతుడి ఆలయాల్లో ఒకటి రంగారెడ్డి జిల్లా 'గుర్రం గూడ'లో కనిపిస్తుంది. ఈ ఊళ్లోకి ప్రవేశిస్తూ ఉండగానే హనుమంతుడి ఆలయం దర్శనమిస్తుంది.

తరతరాలుగా ఇక్కడి వారంతా స్వామిని తమ ఇలవేల్పుగా భావించి పూజిస్తూ ఉంటారు. దుష్టశక్తుల బారి నుంచి ... అంటువ్యాధుల బారి నుంచి స్వామి తమ గ్రామాన్ని రక్షిస్తూ ఉంటాడని విశ్వసిస్తూ ఉంటారు. హనుమజ్జయంతి ... శ్రీరామనవమి ఉత్సవాలు ఇక్కడి ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటూ ఉంటారు.


More Bhakti News