అందుకే రాముడిపై సీతకి అంతటి నమ్మకం

బాల్యం నుంచి కూడా శ్రీరామచంద్రుడు తల్లిదండ్రులను ఎంతగా ప్రేమించేవాడో, అంతగా గౌరవించేవాడు. ప్రకృతిపట్ల ప్రేమ ... సోదరులపట్ల అనురాగం ... తోటివారిపట్ల అభిమానం ... మూగజంతువులపట్ల దయ కలిగి ఉండేవాడు. సత్యం ... ధర్మం ఈ రెండు మాత్రమే ఈ ప్రపంచాన్ని ప్రశాంతంగా అభివృద్ధి పథంవైపు నడిపిస్తాయని విశ్వసించేవాడు.

ప్రతి ఒక్కరూ పరాక్రమాన్ని కలిగి ఉండాలనీ, ఆ పరాక్రమాన్ని ధర్మాన్ని గెలిపించడానికి మాత్రమే ఉపయోగించాలని నమ్మినవాడు. తానంటే తండ్రికి ఎంతటి అనురాగమో తెలిసిన రాముడు, ఎట్టి పరిస్థితుల్లోను ఆయన మాటను జవదాటేవాడు కాదు. యాగానికి అడ్డుపడుతున్న అసురులను సంహరించవలసి ఉందనీ, యాగ రక్షణకి రామలక్ష్మణులను పంపించమని విశ్వామిత్రుడు కోరినప్పుడు దశరథుడు అయిష్టంగానే అంగీకరిస్తాడు. తండ్రి మాటకి కట్టుబడి లక్ష్మణుడితో కలిసి విశ్వామిత్రుడివెంట బయలుదేరుతాడు.

ఈ ప్రయాణం వలన శ్రీరామచంద్రుడికి దట్టమైన అడవులతో పరిచయం ఏర్పడుతుంది. రాక్షసుల మాయా యుద్ధం ఎలా ఉంటుందో తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే జనకమహారాజు సీతాదేవి స్వయంవరాన్ని ప్రకటించడం ... రామలక్ష్మణులను వెంటబెట్టుకుని విశ్వామిత్రుడు అక్కడికి వెళ్లడం జరుగుతుంది. ఎంతో మంది వీరులు ... శూరులు ... ధీరులు వచ్చినప్పటికీ, శ్రీరాముడు మాత్రమే శివధనుస్సును ఎక్కుపెట్టగలుగుతాడు.

సూర్యవంశ కీర్తిప్రతిష్ఠలు ఎలాంటి పరిస్థితుల్లోను దెబ్బతినవు అనే ఆత్మవిశ్వాసంతో రాముడు ఆ స్వయంవరంలో పాల్గొన్న తీరు ... ప్రశంసలకు పొంగిపోని ఆయన వ్యక్తిత్వం ... తాను మనసులో అనుకున్న దానిని మౌనంగానే ఆచరణలో పెట్టే స్థిరమైన చిత్తాన్ని సీతాదేవి గమనిస్తుంది. ముఖ్యంగా అసమానమైన ఆయన పరాక్రమంపట్ల ఆమెకి అంతులేని విశ్వాసం కలుగుతుంది. రావణుడు అపహరించినప్పుడు ... సముద్రానికి అవతల రహస్యంగా ఉంచినప్పుడు సీతాదేవిని ఈ నమ్మకమే కాపాడుతూ వస్తుంది.

గంభీరతతో కూడిన రాముడి మౌనంపై మాయలు పనిచేయవు. ఆయన ఆత్మస్థైర్యం ముందు ఆయుధాలు నిలువలేవు. స్థిరమైన ఆయన చిత్తంలో ఎలాంటి కుట్రలు అలజడి రేపలేవు. ఆయన వదిలిన ప్రతి బాణం ధర్మబద్ధమైన తీర్పు చెబుతుంది. అది అసురుల ఆయుష్షు రేఖను చెరిపేస్తుంది. ఇన్ని విషయాల్లో రాముడిపై సీతమ్మకి ఇంతటి నమ్మకం ఉండటం వల్లనే ఆమె అంతకాలంపాటు నిరీక్షించ గలిగింది. ఆయనతో కలిసి ఆనందంగా అయోధ్యలో అడుగుపెట్ట గలిగింది.


More Bhakti News