వివాహం కానివారికి అమ్మవారి ప్రత్యేక దర్శనం

ఏ క్షేత్రంలోనైనా ... ఏ దైవమైనా గర్భాలయద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా గర్భాలయానికి అమర్చబడిన కిటికీ ద్వారా దైవ దర్శనం చేసుకునే పద్ధతిగల క్షేత్రం ఒకటి ఉంది. ఇక భక్తులంతా కలిసి ఒకేసారి దర్శనం చేసుకునే ఏర్పాట్లు కొన్ని క్షేత్రాల్లో కనిపిస్తే, స్త్రీ పురుషులు వేరు వేరుగా దర్శనం చేసుకునే ఏర్పాట్లు మరికొన్ని క్షేత్రాల్లో కనిపిస్తుంటాయి.

ఇందుకు భిన్నంగా వివాహమైన వాళ్లని ఒక వరుసలో ... వివాహం కాని వాళ్లను మరొక వరుసలో దర్శనానికి పంపించే ఆచారం కూడా ఇదే క్షేత్రంలో కనిపిస్తుంది. చిత్రమైన పద్ధతులతో విలసిల్లుతోన్న 'భీమ్ కాళి' క్షేత్రం మనకు హిమాచల్ ప్రదేశ్ లో దర్శనమిస్తుంది. భీముడిచే కాళికాదేవి ప్రతిమ ప్రతిష్ఠించబడిన కారణంగా ఇక్కడి అమ్మవారిని 'భీమ్ కాళి' పేరుతో కొలుస్తుంటారు.

అనేక మహిమలకు పుట్టినిల్లుగా చెప్పబడుతోన్నఈ క్షేత్రాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటూ ఉంటారు. వివాహమైన వాళ్లు ... కానివాళ్లు అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రత్యేక ద్వారాలు ఏర్పాటుచేయబడ్డాయి. వివాహం కానివారు అమ్మవారిని దర్శించుకోవడం వలన అనతికాలంలోనే వివాహం జరుగుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. ఇక వివాహమైనవారు అమ్మవారిని దర్శించుకుంటే సౌభాగ్యం సుస్థిరమవుతుందని చెబుతుంటారు.

తమ విషయంలో ఈ మహిమ నిజమైందని చెప్పే వాళ్లు ఎందరో ఇక్కడ కనిపిస్తుంటారు. పురాణపరమైన నేపథ్యంగల ఈ క్షేత్రం అమ్మవారి 51 శక్తి పీఠాల్లో ఒకటిగా చెప్పబడుతోంది. స్త్రీ జీవితంలో అత్యంత ముఖ్య ఘట్టాలైన వివాహ యోగ్యతను ... సౌభాగ్యాన్ని ప్రసాదిస్తూ మహిమాన్వితమైన క్షేత్రంగా మనసుపై చెరగని ముద్రవేస్తుంది.


More Bhakti News