విజయాలను అనుగ్రహించే విష్ణు క్షేత్రం

పూర్వం మహారాజులకు ... చక్రవర్తులకు వీరత్వమే ఆభరణమై అందంతోపాటు కీర్తిపతిష్ఠలు తెచ్చిపెట్టేది. అనేక విద్యలను అభ్యసించినప్పటికీ తమ పరాక్రమానికీ ... విజయాలకు మూలం భగవంతుడి యొక్క అనుగ్రహమేనని భావించేవాళ్లు. ఈ నేపథ్యంలోనే వాళ్లు ఎక్కువగా చెన్నకేశవస్వామిని ఆరాధించేవాళ్లు. ఈ స్వామిని పూజించడం వలన వీరత్వం పట్టుసడలదనీ ... విజయం చేజారిపోదని విశ్వసించే వాళ్లు.

ఈ కారణంగానే ఆనాటి రాజులు చెన్నకేశవస్వామి ఆలయాలను విరివిగా నిర్మించారు ... వాటి అభివృద్ధికి తమవంతు కృషి చేశారు. అలాంటి ఆలయాలలో చిత్తూరు జిల్లా 'సోంపాళ్యం' ఒకటిగా కనిపిస్తుంది. చోళరాజులు నిర్మించిన ఈ ఆలయం, విజయనగర రాజుల కాలంలో మరింతగా అభివృద్ధికి నోచుకుని తన విశిష్టతను చాటుకుంటోంది.

చోళుల స్వామి భక్తికీ ... విజయనగర రాజుల అంకితభావానికి ఈ ఆలయం ఓ మచ్చుతునకగా నిలుస్తుందని చెప్పవచ్చు. సువిశాలమైన ప్రదేశంలో బండరాళ్ల అమరికతో ఈ ఆలయం నిర్మించబడింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ క్షేత్రంలో ఎంతసేపు గడిపినా సమయం తెలియదు. శిల్పకళాశోభితమైన రాజగోపురం ... ప్రాకారాలు ... మంటపాలు ... స్తంభాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి.

గర్భాలయంలో స్వామివారు ... ఆ పక్కనే గల ప్రత్యేక మందిరంలో లక్ష్మీదేవి భక్తులను అనుగ్రహిస్తూ కనిపిస్తుంటారు. అలనాటి వైభవానికి గుర్తుగా నిలిచిన ఈ క్షేత్రంలో అడుగుపెడితే, తలపెట్టిన కార్యాలు విజయవంతమవుతాయని ఈనాటికీ భక్తులు విశ్వసిస్తుంటారు. పర్వదినాల సమయంలో స్వామివారిని మరింత భక్తి శ్రద్ధలతో సేవించి తరిస్తుంటారు.


More Bhakti News