దైవదర్శనం

దైవం అత్యంత శక్తిమంతమైనది ... అసలు మన కంటికి కనిపించని శక్తికి మనం పెట్టుకున్న పేరే దైవం. అలాంటి దైవానుగ్రహానికి కృషి చేయడం ... ముక్తిని సాధించడమే ప్రతి వారి కర్తవ్యం. ఆధ్యాత్మిక గ్రంధాలు చదివితే ... ఒక మనిషి మనసు గెలుచుకోవడం కన్నా దేవుడు మనసు గెలుచుకోవడం చాలా తేలిక అనే విషయం బోధపడుతుంది. అందుకే భగవంతుడిని భక్త సులభుడు అన్నారు. అలాంటి దైవ దర్శనానికి వెళ్లడానికి ముందు ప్రతి వారు కొన్ని నియమాలను పాటించవలసి వుంటుంది.

సాధారణంగా చాలామంది గుడికి రాగానే గబగబా చెప్పులు విప్పేసి ప్రదక్షిణలు మొదలు పెట్టేస్తుంటారు. కానీ ఆ విధంగా చేయడం ఓ రకంగా అపచారమే అవుతుంది. దేవాలయానికి ఎన్నో వీధులను దాటుకుంటూ చెప్పులు ధరించి రావడం జరుగుతుంది. అలాగే అప్పటివరకూ ఏవో వ్యర్తమైన మాటలు మాట్లాడటం ... మనసును కలుషితం చేసే ఆలోచనలు వంటివి చేస్తుంటాం. అందువలన ముందుగా కాళ్లను శుభ్రంగా కడుక్కుని ... నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించి వదలాలి. అ తరువాత తలపై కాసిని నీళ్లు చిలకరించుకుని ప్రధాన మంటపంలోకి ప్రవేశించాలి.

ఇలా శరీరం ... మనసు ... వాక్కుకు పరిశుద్ధత కలిగిన తరువాతనే ప్రదక్షిణలు చేసి దైవాన్ని దర్శించాలి. ఇక ప్రధాన దైవానికి ఎదురుగా నిలబడి దర్శనం చేసుకోకూడదు ... ఎందుకంటే, ప్రధాన దైవానికి ఎదురుగా ఆంజనేయస్వామి మందిరాలుగానీ ... గరుత్మంతుడి మందిరాలు గాని ... నంది విగ్రహాలు గాని తప్పనిసరిగా ఉంటూ వుంటాయి. కాబట్టి ఓ పక్కగా నిలుచుని మాత్రమే దైవాన్ని దర్శించాలని శాస్త్రం చెబుతోంది.


More Bhakti News