అయ్యప్పస్వామి పద్ధెనిమిది మెట్ల విశేషం

అయ్యప్పస్వామి దర్శనంలో పద్ధెనిమిదిమెట్లు ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. అయ్యప్పస్వామి మండల దీక్షను తీసుకున్న భక్తులకు మాత్రమే ఈ పద్ధెనిమిది మెట్లను అధిరోహించే అర్హత ఉంటుంది. ఇరుముడి తలపై పెట్టుకుని ఈ సోపానాలను అధిరోహించడానికి భక్తులు ఆరాటపడుతుంటారు. పసిడిపూతతో మెరిసే ఈ పద్ధెనిమిది మెట్ల వెనుక ఆధ్యాత్మిక పరమైన విశిష్టత దాగివుండటమే అందుకు కారణం. ఈ మెట్లను అధిరోహిస్తూ వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భక్తులు భావిస్తుంటారు.

శబరిమలలో స్వామివారి ప్రతిష్ఠ జరిగిన సమయంలో పద్ధెనిమిది రకాల వాయిద్యాలను మోగించారట. మృదంగం .. ఢమరుకం .. దుందుభి .. తుంబురు .. మర్దల .. మట్టుక .. డిండిమ .. ధవళ .. పటాహ .. కాహళ .. నూపుర .. జజ్జరి .. ఢక్క .. శంఖ .. భేరి .. వీణ .. వేణువు .. జంత్ర అనే వాయిద్యాలు ఈ జాబితాలో కనిపిస్తాయి. ఈ వాయిద్యాలకు ప్రతీకలుగా ఈ మెట్లు దర్శనమిస్తూ ఉంటాయి.

ఇక ఈ పద్ధెనిమిది మెట్లలో వివిధ దేవీ దేవతలు ఆవాహాన చేయబడినట్టు స్థలపురాణం చెబుతోంది. బ్రహ్మ .. విష్ణువు .. మహేశ్వరుడు .. సరస్వతీదేవి .. లక్ష్మీదేవి .. పార్వతీదేవి .. అష్ట దిక్పాలకులు .. ఆదిపరాశక్తి .. సూర్యుడు .. బృహస్పతి .. దేవేంద్రుడు ఈ మెట్లమార్గంలో కొలువుదీరి ఉంటారని చెప్పబడుతోంది. ఇంతమంది దేవతల సమక్షంలో ... వాళ్ల ఆశీస్సులతో ముందుకు వెళ్లి అయ్యప్పస్వామి దర్శనం చేసుకోవడం వలన జన్మజన్మల పాపం కొట్టుకుపోతుంది. ముందుజన్మలకి తరగని పుణ్యఫలాలను ప్రసాదిస్తుంది.


More Bhakti News