తిరుమల వేంకటేశ్వరుడి మహిమ !

ఎప్పటిలానే ఓ రాత్రివేళ వెంగమాంబ ఇంటికి వేంకటేశ్వరస్వామి వస్తాడు. ఆయనని ఆప్యాయంగా ఆహ్వానించి రుచికరమైన పండ్లను సమర్పిస్తుంది వెంగమాంబ. ఆ స్వామి ఫలహారాలను ఆరగిస్తూ ఉంటే, ఆయన పాదాలను వత్తుతూ కూర్చుంటుంది. స్వామి పరవశించిపోతూ వింటూవుంటే, తాను రాసిన కీర్తనలను చదువుతుంది. ప్రతిరోజు ఆయనలా వచ్చి కొంతసేపు కూర్చుని వెళ్లడం తనకి చాలా బాధకలిగిస్తుందనీ, ఇక మీదట తన దగ్గరే ఉండిపోవాలని కోరుతుంది వెంగమాంబ.

ఆమెలాంటి భక్తులు ఎందరో ఆనందనిలయం చెంత తన కోసం ఎదురుచూస్తూ ఉంటారనీ, వారికి బాధకలిగించడం ధర్మంకాదని చెబుతాడు వేంకటేశ్వరస్వామి. ఆయన సేవకు తాను క్షణకాలమైనా దూరంగా ఉండలేననీ, ఏదేవైనా తన దగ్గర ఉండిపోవలసిందేనంటూ ఆమె స్వామివారి పట్టు పీతాంబరాన్ని గట్టిగా పట్టుకుంటుంది. అదే సమయంలో సుప్రభాతసేవ మొదలుకావడంతో, తాను భక్తులకు దర్శనమిచ్చే సమయమైనదంటూ ఒక్కసారిగా స్వామి అక్కడి నుంచి హడావిడిగా వెళతాడు.

దాంతో స్వామివారి పీతాంబరంలో కొంతభాగం చిరిగి వెంగమాంబ చేతిలోకి వస్తుంది. సుప్రభాతసేవ ముగిసిన తరువాత గర్భాలయంలోకి అడుగుపెట్టిన అర్చకులు, స్వామి పట్టు వస్త్రం చిరిగి ఉండటం చూసి ఆశ్చర్యపోతారు. స్వామివారి లీలా విశేషాలను గురించి తెలిసిన అర్చకులు ... ప్రధాన సిబ్బంది, నేరుగా వెంగమాంబ ఇంటికి వెళ్లి తాము వచ్చిన పనిని గురించి చెబుతారు. వెంగమాంబ స్వామివారి పీతాంబరాన్ని తీసుకువచ్చి వాళ్లకి అందజేస్తుంది. పట్టు వస్త్రం చిరిగిన ముక్కగా కాకుండా పూర్తిగా ఉండటం వారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తూనే వాళ్లు ఆ వస్త్రాన్ని తీసుకుని ఆనంద నిలయానికి వస్తారు.

అంతకుముందు స్వామి మూలమూర్తిపై కనిపించిన చిరిగిన వస్త్రం ఇప్పుడు లేకపోవడం వాళ్లని మరింత ఆశ్చర్యచకితులను చేస్తుంది. జరిగిన సంఘటనను స్వామివారి ప్రత్యక్ష నిదర్శనంగా భావించిన అర్చకులు మంత్ర పూర్వకంగా ఆ పట్టు వస్త్రాన్ని స్వామివారికి ధరింపజేస్తారు. ఈ సంఘటన వెంగమాంబ నిజభక్తిని ఈ లోకానికి వెల్లడి చేస్తుంది. అసమానమైన భక్తి శ్రద్ధలతో శ్రీవారిని సేవిస్తే ఆయన అనుక్షణం వెంటే ఉంటాడనే విషయాన్ని స్పష్టం చేస్తుంది.


More Bhakti News