ఆయురారోగ్యలనిచ్చే అపూర్వ క్షేత్రం

భగవంతుడి అనుగ్రహాన్ని కోరుతూ మునులు ... ఋషులు ... దేవతలు తపస్సులు చేసేవాళ్లు. భగవంతుడు ప్రత్యక్షమైన తరువాత, సాధారణ మానవుల దర్శనార్థం అదే ప్రదేశంలో ఆవిర్భవించమని కోరేవారు. అలా ఏర్పడిన పుణ్యక్షేత్రాలు నేడు భక్తులపాలిట కల్పవృక్షాలుగా అలరారుతున్నాయి. అయితే ఎవరూ ఎలాంటి ప్రార్ధనలు చేయకుండా, భగవంతుడే లోకకల్యాణార్థం వెలసిన క్షేత్రాలు మరింత విశిష్టమైనవిగా వెలుగొందుతున్నాయి.

అలాంటి క్షేత్రాలలో ఒకటిగా కర్ణాటక రాష్ట్రంలోని 'మళూరు' విలసిల్లుతోంది. ఎవరూ కోరకుండానే శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించిన కారణంగా ఇక్కడి స్వామిని 'అప్రమేయస్వామి' గా కొలుస్తుంటారు. నాచ్చియార్ ... నీళాదేవి పేర్లతో అమ్మవార్లు భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. మహాభక్తుడైన పురందరదాసు ఇక్కడి మంటపంలో కూర్చునే స్వామివారిని కీర్తించేవాడని చెబుతుంటారు. ఎంతోమంది మహారాజులు ... మహాభక్తులు ... ఆళ్వారులు ఇక్కడి స్వామిని సేవించి తరించినట్టుగా ఆధారాలు ఉన్నాయి.

యుగాలక్రితం నాటిదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రంలో, స్వామివారిని దర్శించుకోవడం వలన సమస్త పాపాలు ... వ్యాధులు నశించి సకల సంపదలు కలుగుతాయని చెబుతుంటారు. ఇక ఇదే ప్రాంగణంలో వ్యాసమహర్షి ప్రతిష్ఠించిన బాలకృష్ణుడి ప్రతిమ చూపరుల కళ్లను కట్టిపడేస్తుంది. ఇక ఈ చిన్ని కృష్ణుడికి సంబంధించి కూడా అనేక మహిమలు ప్రచారంలో ఉన్నాయి. అటు పురాణపరమైన ప్రాధాన్యతను ... ఇటు చారిత్రక వైభవాన్ని కలిగివున్న అప్రమేయస్వామిని దర్శించిన వాళ్లు ధన్యులవుతారు ... పూజించిన వాళ్లు పునీతులవుతుంటారు.


More Bhakti News