శివుడికి దూరంగా నాగరాజు ఉండలేడా ?

సదాశివుడి కంఠాభరణంగా అమరిన నాగరాజు అనునిత్యం ... అనుక్షణం ఆయనతోనే ఉంటాడు. ఆ మహాదేవుడి ఎడబాటును ఆయన ఎంతమాత్రం భరించలేనట్టుగా కనిపిస్తూ ఉంటాడు. ఈ కారణంగానే శంకరుడు ఆవిర్భవించిన ప్రతి క్షేత్రంలోను ఆయన సేవలు చేస్తూ అక్కడ నాగేంద్రుడు దర్శనమిస్తూ ఉంటాడు.

అయితే శివుడితో పాటు నాగరాజు శిలా రూపంలో కనిపిస్తూ ఉండటం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా పూర్వం ఇక్కడ నాగరాజు సంచరించిన ఆనవాళ్ళే కాకుండా ఇప్పుడు నాగరాజు స్వయంగా స్వామివారి సన్నిధిలో కనిపిస్తూ ఉండటమనేది ఒక మహిమాన్వితమైన సంఘటనగానే పరిగణించడం జరుగుతుంటుంది.

అలాంటి క్షేత్రం మనకి నిజామాబాద్ జిల్లా 'చిన్నకోడప్ గల్' లో కనిపిస్తుంది. వనవాస కాలంలో సీతారామలక్ష్మణులు ఈ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించినట్టుగా స్థలపురాణం చెబుతోంది. ఆ తరువాత కాలంలో ఎందరో మహర్షులు ... మునులు ... సిద్ధులు ఇక్కడి స్వామివారిని సేవించినట్టు ఆధారాలు ఉన్నాయి. ఆది నుంచి కూడా ఒక నాగరాజు స్వామివారి సన్నిధికి వచ్చి ఆయన దర్శనం చేసుకుని వెళుతూ ఉండేదట.

ఇప్పటికీ కూడా ఆ నాగరాజు వచ్చి వెళుతూనే ఉంటుంది. చాలామంది భక్తులకు అది దర్శనమిచ్చిందని కూడా చెబుతుంటారు. ఈ పాము ... నాగదేవతనీ, అందువల్లనే అది పాకిన చోట గుర్తులు పడుతుంటాయని చెబుతుంటారు. ఇందుకు నిదర్శనంగా అక్కడి రాళ్లపై పాము ఆకారంలో గల అనేక ఆనవాళ్లను చూపిస్తుంటారు. ఈ కారణంగానే ఈ క్షేత్రంలో శివయ్యతో పాటు నాగదేవతను కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటారు.


More Bhakti News