భక్తుల కోసం నది దిశను మార్చిన దేవదేవుడు

రామాలయం అనగానే సీతారామలక్ష్మణులు కొలువుదీరి ఉంటారనే ఉద్దేశంతో లోపలికి అడుగుపెడుతూ ఉంటాం. గర్భాలయంలో సీతలేని రామలక్ష్మణులు కనిపిస్తే ఆశ్చర్యపోతుంటాం. హనుమంతుడు కూడా కనిపించకపోతే నివ్వెరపోతుంటాం. ఆ తరువాత అసలు విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకుంటూ ఉంటాం. అలాంటి క్షేత్రం మనకి గుంటూరు జిల్లా 'సత్రశాల' లో కనిపిస్తుంది.

వివాహానికి ముందు విశ్వామిత్రుడితో కలిసి రామలక్ష్మణులు ఈ ప్రదేశంలో బసచేశారు. ఈ కారణంగానే ఇక్కడ సీత - హనుమంతుడి విగ్రహాలు కనుపించవు. ఇక పరమశివుడి పాదస్పర్శ కారణంగా కూడా ఈ క్షేత్రం మరింత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. ఇక్కడికి సమీపంలో 'జెట్టిపాలెం' లో పూర్వం కృష్ణానది దక్షిణ దిశగా ప్రవహిస్తూ ఉండేదట. దాంతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు నానాఅవస్థలు పడుతూ ఉండేవాళ్లట.

అలాంటి పరిస్థితుల్లో పరమశివుడి అనుగ్రహాన్ని కోరుతూ శృంగిమహర్షి కఠోర తపస్సు చేశాడు. ఆయన భక్తికి మెచ్చిన శంకరుడు ప్రత్యక్షమై, వరం కోరుకోమని అడిగాడు. ఇక్కడి నది దక్షిణ దిశగా ప్రవహిస్తున్న కారణంగా ప్రజలంతా నానాఇబ్బందులు పడుతున్నారనీ, ఆ కష్టాల నుంచి వాళ్లను గట్టెక్కించమని శృంగిమహర్షి మనవిచేశాడు. దాంతో సదాశివుడు తన 'జటపాయ'తో ఆ నది దిశను ఉత్తర దిక్కుకు మార్చాడు.

ఈ కారణంగానే ఈ ప్రదేశానికి 'జటపాలెం' అనే పేరు వచ్చిందనీ, కాలక్రమంలో అది 'జెట్టిపాలెం' గా మార్పు చెందిందని స్థలపురాణం చెబుతోంది. మహిమాన్వితమైన ఈ క్షేత్రంలోకి అడుగుపెడితే ఆనాటి ఘట్టాలకు సంబంధించిన ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ... అనిర్వచనీయమైన ఆనందానుభూతులు అందిస్తుంటాయి.


More Bhakti News