రామాయణంతో ముడిపడిన రమణీయ ప్రదేశం

భారతీయుల గుండెల్లో సీతారాములు గుడి కట్టుకుని ఉంటారు. సీతారాములు ఫలానాచోట నడిచారు ... ఫలానాచోట కూర్చున్నారు ... ఫలానాచోట కబుర్లు చెప్పుకున్నారు అని విన్నప్పుడు ఆ ప్రదేశాలను తనివితీరా చూడాలనీ ... ఆత్మీయంగా తడమాలని ప్రతి ఒక్కరికీ అనిపిస్తూ ఉంటుంది. పవిత్రమైన అక్కడి నేలపై గల ధూళిని కళ్లకి అద్దుకోవాలని అనిపిస్తుంది.

అందరికీ కూడా సీతారాములతో అంతటి అనుబంధం ఉంది. సీతారాములు తిరుగాడిన పుణ్యప్రదేశాల్లో 'చిత్రకూటం' ఒకటిగా కనిపిస్తుంది. ఇక్కడి గాలి ... నీరు ... నేల సీతారాముల స్పర్శతో పునీతమైనట్టుగా కనిపిస్తూ ఉంటాయి. మౌనంగా సాగిపోతోన్న మందాకినీ నది ... సీతారాములు విశ్రాంతి తీసుకున్న ప్రదేశం ... వర్షాకాలంలో సీతా రామలక్ష్మణులకు ఆశ్రయమిచ్చిన గుహలు ఈనాటికీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి.

ఇక ఇక్కడ ప్రవహించే 'హనుమాన్ ధార' గురించి ఆసక్తికరమైన కథ ఒకటి వినిపిస్తూ ఉంటుంది. సీతాన్వేషణ నిమిత్తం లంకానగారానికి చేరుకున్న హనుమంతుడు, ఆ నగర సౌందర్యాన్ని చూసి ముగ్ధుడవుతాడు. రావణుడి బలాబలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కోసం పట్టుబడతాడు. ఆ సమయంలోనే రావణుడి అనుజ్ఞ మేరకు ఆయన సైనికులు హనుమంతుడి తోకకు నిప్పుపెడతారు.

మండుతోన్న ఆ తోకతో రావణుడి భవంతులకు నిప్పుపెట్టి హనుమంతుడు అక్కడి నుంచి బయటపడతాడు. అలా కాలిన గాయాలతో తిరిగొచ్చిన హనుమంతుడిని ఉపశమింపజేయడం కోసం, రాముడు ఈ నీటి ప్రవాహాన్ని సృష్టించాడు. ఈ కారణంగానే ఇది 'హనుమాన్ ధార' గా పిలవబడుతోందని స్థలపురాణం చెబుతోంది. ఇలా రామాయణంతో ముడిపడిన ఈ రమణీయ దృశ్యాలను వీక్షించడం మరిచిపోలేని మధురానుభూతిని కలిగిస్తుంది.


More Bhakti News