మహిమగలిగిన పలనాటి వీరశిలలు !

పౌరుష పరాక్రమాలకు ప్రతీకగా కనిపించే 'పల్నాటియుద్ధం' గురించి తెలియని వాళ్ళుండరు. 11 వ శతాబ్దం ద్వితీయార్థంలో జరిగిన ఈ యుద్ధంలో, ఇరు వర్గాలకి చెందినవారిగా బ్రహ్మనాయుడు - నాయకురాలు నాగమ్మ ప్రధాన భూమికలను పోషించారు. మలిదేవరాజు తరఫున యుద్ధరంగంలో దిగిన వీరులు ఎంతోమంది యుద్ధరంగంలో ప్రాణాలు విడుస్తూ, తమ గుర్తుగా ఒక్కొక్కరూ ఒక్కో రాతిపలకను బ్రహ్మనాయుడికి అందజేశారు.

వారి వీరత్వానికి ... త్యాగనిరతికి నిదర్శనంగా ఆ రాతి పలకలను బ్రహ్మనాయుడు భద్రపరిచాడు. వీరుల ప్రాణాలు ఆ రాతి పలకల్లో నిక్షిప్తమై ఉన్నాయనీ, ప్రతియేడు కారంపూడి సమీపంలో గల నాగులేటి ఒడ్డున ఆ రాతి పలకలకు ఆరాధనా మహోత్సవాలను నిర్వహించమని ఆయన వీరాచార పీఠాధిపతులకు చెప్పాడట. ఆనాటి నుంచి ఈ ఉత్సవాలు జరుగుతూ వస్తున్నాయి.

ఈ వీరశిలలు మహిమాన్వితమైనవని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఒకసారి తన దండయాత్రలో భాగంగా ఢిల్లీ సుల్తాన్ ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ బస చేశాడట. సుల్తాన్ భోజనం కోసం ఆయన సిబ్బంది అక్కడే ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఆ వీరశిలలను మామూలు రాళ్లుగా భావించి వాటిని వంట రాళ్లుగా ఉపయోగించారు. పొయ్యి వెలిగించడమే ఆలస్యంగా ఏదో తెలియని బాధతో ఎక్కడి వాళ్లు అక్కడ పడిపోయారట. మిగతా వాళ్లు హఠాత్తుగా తీవ్రమైన అనారోగ్యానికి లోనయ్యారు.

అప్పుడు చెన్నకేశవస్వామి మారువేషంలో వచ్చి, వాళ్లు చేసిన అపరాథాన్ని గురించి చెప్పాడట. అలా అసలు సంగతి తెలుసుకున్న సిపాయులు తమని మన్నించమని వీరగల్లులకు నమస్కరించుకుని అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారని ఇక్కడి స్థలపురాణం చెబుతోంది.


More Bhakti News