విభూతి గుండంగా మారిన రుద్రగుండం !

సిద్ధేశ్వరుడుగా పరమశివుడు ఆవిర్భవించిన పరమపవిత్రమైన క్షేత్రం మనకి గుంటూరు జిల్లా 'తేరాల' గ్రామసమీపంలో కనిపిస్తుంది. ఈ క్షేత్రంలో అడుగుపెట్టగానే ఇక్కడి 'విభూతి గుండం' గురించిన విశిష్టత చెవిన పడుతుంది. ఈ విభూతి గుండం మహిమాన్వితమైనదనీ, ఇందులోని నీటిని తీర్థంగా స్వీకరించినవారికి అనారోగ్య బాధలు తీరిపోతాయని చెబుతుంటారు. సాక్షాత్తు పరశురాముడు ఈ కోనేరును తవ్వినట్టు ఇక్కడి స్థలపురాణం చెబుతోంది.

సిద్ధేశ్వరస్వామిని అభిషేకించేందుకుగాను పరశురాముడు ఈ కోనేరును తవ్వాడు. ఈ కోనేరు నీటితో నిండగానే సదాశివుడిని అభిషేకించడానికి అవసరమైన జలాన్ని ఆయన ఒక పాత్రలో తీసుకున్నాడట. అయితే ఆ నీరు రక్త వర్ణంలో కనిపించడంతో పరశురాముడు నివ్వెరపోయాడు. తాను చేసిన క్షత్రియవధ పాపాల రూపంలో తనని వెంటాడుతోందని ఆయన గ్రహించాడు. అందువల్లనే కోనేరులో నీరు ఎరుపు రంగులోకి మారిందని తెలుసుకున్నాడు.

తనకి పాపాల నుంచి విముక్తిని కలిగించమని సిద్ధేశ్వరస్వామిని పరశురాముడు వేడుకున్నాడు. తన పాపాలు పటాపంచాలయ్యాయని తాను నమ్మడానికి గాను, రుద్రగుండంలో గల నీటిని స్వచ్ఛంగా మార్చమని కోరతాడు. అందుకోసం నిరీక్షిస్తూ పరశురాముడు ఇక్కడ కొంతకాలంపాటు తపస్సు చేశాడు. క్రమంగా ఆయన పాపాలు పరిహరించాబడ్డాయి. అందుకు నిదర్శనంగా రుద్రగుండంలోని నీళ్లు స్వచ్ఛమైనవిగా మారిపోయాయి.

అంతే కాకుండా కోనేటి అడుగుభాగంలోగల మట్టి విభూతి రంగులోకి మారిపోయింది. ఈ మట్టిని విభూతి రేఖలుగా నుదుటున ధరిస్తుంటారు. ఈ కారణంగానే ఈ కోనేరుకి విభూతిగుండం అనే పేరు వచ్చిందని అంటారు. ఆనాటి నుంచి ఈనాటి వరకూ ఈ విభూతి గుండం తన ప్రత్యేకతను ... విశిష్టతను చాటుకుంటూనే ఉంటుంది.


More Bhakti News