ఇచ్చినమాట నిలబెట్టుకున్న శంకరుడు!

ఆదిశంకరాచార్యులు సన్యాసాశ్రమ విషయంలో తన నిర్ణయాన్ని తల్లికి చెప్పి ఇంటి నుంచి బయలుదేరుతూ, ఆమె ఎప్పుడు తలచుకుంటే అప్పుడు వస్తాననీ ... ఆమె శరీరాన్ని వదిలినప్పుడు దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహిస్తానని మాటిస్తాడు. ఆ మాటకు సంతృప్తి చెందిన ఆర్యాంబ, ఆయనకి వీడ్కోలు పలుకుతుంది. కాలచక్రంలో కొంతకాలం గడిచిపోతుంది.

శంకరుల వారు తన శిష్య గణంతో అనేక పుణ్య క్షేత్రాలను దర్శిస్తూ, తన పాదధూళిచే ఆ క్షేత్రాలకు మరింత పవిత్రతను తీసుకువస్తుంటాడు. అలాంటి పరిస్థితుల్లోనే కొనఊపిరితో ఉన్న ఆర్యంబ ... శంకరుల వారిని తలచుకుంటుంది. క్షణాల్లో ఆయన తన తల్లిముందు ప్రత్యక్షమవుతాడు. ఆమెకి హరిహరుల దర్శనం ఇప్పించి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. తల్లి పార్థివ శరీరానికి దహన సంస్కారాలు జరిపించడానికి సిద్ధపడతాడు.

అయితే సన్యాసి అయిన కారణంగా దహన సంస్కారాలు జరిపించే అర్హత ఆయనకి లేదంటూ అగ్రహారంలోని వాళ్లంతా వాదిస్తారు. ఏది ఏమైనా తన తల్లికిచ్చిన మాట నిలబెట్టుకుంటానని చెబుతాడు శంకరులవారు. దాంతో ఆయన సంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడంటూ వాళ్లు తమ సహాయ సహకారాలను నిలిపివేస్తారు.

దాంతో స్మశానానికి తల్లి శవాన్ని తీసుకువెళ్లే వారు కరువౌతారు. అంతిమ సంస్కారాలకి అవసరమైన అగ్నిని ఇవ్వడానికి కూడా అందరూ నిరాకరిస్తారు. దాంతో తన తల్లి పార్థివ దేహానికి పెరట్లోనే చితి ఏర్పాటుచేసి, తన అరచేతుల రాపిడితో అగ్నిని సృష్టించి దహనసంస్కారాలు జరిపిస్తాడు శంకరులవారు. అలా ఆయన కన్నతల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు.


More Bhakti News