కన్నెతులసి నోము

కన్నె పిల్లలు జరుపుకునే ప్రధానమైన నోములలో 'కన్నె తులసి నోము'ఒకటి. ఈ నోము ఆరోగ్యాన్ని ... ఆయుష్షును ... వివాహానంతరం చక్కని సౌభాగ్యాన్ని ఇస్తుంది. కష్టాల నుంచి ... కన్నీళ్ల నుంచి గట్టెక్కిస్తుంది. ఈ నోము కన్నెపిల్లలు నోచుకోవడానికి వీలుగా ... తేలికగా ఉంటుంది.

ప్రతి నిత్యం ఉదయాన్నే స్నానం చేసి తులసి మొక్క చుట్టూ మూడు ప్రదక్షిణాలు ... మూడు నమస్కారాలు చేసి అక్షింతలు తలపై వేసుకోవాలి. ఈ విధంగా ఏడాది పాటు తులసిని పూజించాక, 26 జతల అరిసెలు చేయించి 13 జతల అరిసెలను నైవేద్యంగా పెట్టాలి. ఓ కన్నె పిల్లకు కొత్త బట్టలు పెట్టి, మరో 13 జతల అరిసెలను వాయనమివ్వాలి. నైవేద్యంగా పెట్టిన అరిసెలను తన ఈడు పిల్లలతో కలిసి తిన్న తరువాత ఉద్యాపన చెప్పుకోవలసి ఉంటుంది.

ఇక ఈ నోము నోచుకోవడం వెనుక ఓ కథ వుంది. పూర్వం బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఓ అమ్మాయి, సవతి తల్లి కారణంగా నానాకష్టాలు పడుతూ వుండేది. సవతి తల్లి వలన తాను పడుతున్న కష్టాలను తండ్రితో చెప్పుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో, ఆ అమ్మాయి 'తులసి మొక్క'తో చెప్పుకుని ఊరట చెందేది.

ఇంటి పనులతో పాటు సవతి తల్లి కొడుకును ఆడించే పని కూడా ఆ అమ్మాయిపైనే పడింది. ఓ రోజున సవతి తల్లి బయటకి వెళుతూ పిల్లవాడిని చూసుకోమంటూ చెప్పి ఆ అమ్మాయికి రెండు అరిసె ముక్కలిచ్చింది. వాటిని ఆ అమ్మాయి తులసికి నైవేద్యంగా సమర్పించింది. దాంతో తులసి ప్రత్యక్షమై ... క్రితం జన్మలో కన్నె తులసి నోము మధ్యలో ఆపేసిన కారణంగానే ఆమెకి అన్ని కష్టాలు వస్తున్నాయని చెప్పింది. అమ్మమ్మ గారింటికి వెళ్లి ఆ నోము నోచుకోమని విధి విధానాలను వివరించింది.

తులసమ్మ చెప్పినట్టుగానే ఆ అమ్మాయి అమ్మమ్మ ఇంటికి వెళ్లి ఆ నోము నోచుకుంది. ఫలితంగా సవతి తల్లి మనసు మార్చుకుని వచ్చి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్లడమే కాకుండా, ఆ రోజు నుంచి ఆమెను కన్నబిడ్డలా చూసుకోవడం మొదలు పెట్టింది.


More Bhakti News