పూనకంతో కుక్కలు ఊగిపోయే క్షేత్రం !

సాధారణంగా భక్తులందరూ ఆలయంలో దైవదర్శనం చేసుకుంటూ ఉంటే, హఠాత్తుగా ఓ కుక్క ఆలయంలోకి పరిగెత్తుకు వస్తే కంగారుపడిపోతూ అందరూ దానికి దూరంగా జరుగుతారు. ఆ కుక్క తాకడం వలన మైల పడిపోతామని వాళ్లు భావిస్తుంటారు. అలాంటిది ఆలయంలో ఎక్కడ చూసినా కుక్కలు కనిపిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు. ఆలయంలో గల దైవానికి కుక్కపిల్లలను కానుకగా సమర్పిస్తే విస్తుపోతారు.

అలాంటి దృశ్యం మనకి కేరళా ప్రాంతానికి చెందిన 'పరిశినిక్కడవు' గ్రామంలో కనిపిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ క్షేత్రంలో 'ముత్తప్పస్వామి' భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ స్వామి వాహనంగా కుక్క కనిపిస్తుంది. క్షేత్ర చరిత్రకు తగినట్టుగానే ఆలయంలో కుక్కలు విపరీతంగా కనిపిస్తూ ఉంటాయి.

స్వామివారి వాహనంగా భక్తులు ఇక్కడి కుక్కలపట్ల కరుణ చూపుతుంటారు. వాటి ఆకలి తీర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ కారణంగానే ఆలయ ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో కుక్కలు కనిపిస్తుంటాయి. మరికొంత మంది స్వామి అనుగ్రహాన్ని పొందడం కోసం కుక్కబొమ్మలను ... కుక్క పిల్లలను కానుకలుగా సమర్పిస్తూ ఉంటారు. అలా వచ్చిన కుక్కల ప్రతిమలు పెద్ద సంఖ్యలో ఇక్కడ కనిపిస్తుంటాయి. ఈ క్షేత్రంలో గణాచారి వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వబడుతోంది. ఉత్సవాలలోను ... ఊరేగింపులలోను వీళ్లు ప్రముఖమైన పాత్రను పోషిస్తుంటారు.

ఇక విశేషమైన తిథుల్లో ఇక్కడి కుక్కలకు పూనకం రావడం గురించి భక్తులు ఆశ్చర్యంతో చెప్పుకుంటూ ఉంటారు. పూనకంతో కొన్ని కుక్కలు ఊగిపోతుండటం చూసినవారికి ఇది మహిమాన్వితమైన క్షేత్రమని అనిపించక మానదు. విచిత్రమైన ఈ విశేషాన్ని చూడటం కోసమే వివిధ ప్రదేశాల నుంచి భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. ఇక్కడ స్వామి తన వాహనమైన కుక్కతో ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడని విశ్వసిస్తుంటారు.


More Bhakti News