జాంబవంతుడు ప్రతిష్ఠించిన సీతారాములు

ఇటీవల కాలంలో నిర్మించబడిన సీతారామాలయాల్లోకి అడుగుపెడితే, సీతారాములతో పాటు లక్ష్మణుడు - హనుమంతుడు దర్శనమిస్తుంటారు. అదే ప్రాచీనకాలానికి చెందిన రామాలయాల్లోకి వెళితే, వీరితో పాటు భరతుడు - శత్రుఘ్నుడు కూడా కనిపిస్తుంటారు. ఇలా వీరంతా వేడుక జరుగుతున్నట్టుగా కనిపించడాన్ని 'పట్టాభిషేక సన్నివేశం' గా చెబుతుంటారు.

ఇలా గర్భాలయంలో అందరూ కొలువుదీరి ఉండటాన్ని చిత్తూరు జిల్లా 'వాయల్పాడు' క్షేత్రంలో చూడవచ్చు. త్రేతాయుగానికి చెందిన ఈ క్షేత్రంలో వాల్మీకిమహర్షి తపస్సు చేసుకున్నాడనీ, జాంబవంతుడు ఇక్కడి మూలమూర్తులను ప్రతిష్ఠ చేశాడని స్థలపురాణం చెబుతోంది. ఇక్కడి మూలమూర్తుల్లోను ... ఉత్సవ మూర్తుల్లోను జీవం ఉట్టిపడుతూ ఉంటుంది. తాళ్లపాక అన్నమయ్య ఇక్కడి సీతారాములను దర్శించుకుని స్వామివారికి సంకీర్తనాభిషేకం చేసినట్టుగా ఆధారాలు ఉన్నాయి.

ఎంతోమంది రాజులు ... సంస్థానాధీశులే కాకుండా, ఆంగ్లేయ అధికారి అయిన లార్డ్ హార్డింగ్ కూడా ఇక్కడి రాములవారిని సేవించి తరించడం విశేషం. ఇక మరో ప్రత్యేకత కూడా భక్తులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. సాధారణంగా అన్ని సీతారామాలయాల్లోను శ్రీరామనవమి రోజున సీతారాములకు కళ్యాణాలు జరపబడుతుంటాయి. అందుకు భిన్నంగా ఇక్కడ సీతాదేవి జన్మ నక్షత్రమైన 'ఆశ్లేష' నక్షత్రం రోజున కల్యాణ మహోత్సవాన్ని జరిపిస్తారు.

ఇక శ్రీరామనవమి సందర్భంగా తొమ్మిది రోజుల పాటు ఘనంగా బ్రహ్మోత్సవ వేడుకలను నిర్వహించడం జరుగుతుంటుంది. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలకి చెందిన భక్తులు ఈ క్షేత్రానికి తరలివస్తుంటారు. యుగాలక్రితం నాటిదిగా చెప్పబడుతోన్న ఈ పవిత్ర ప్రదేశంలో కాలుమోపడమే అదృష్టంగా భావిస్తుంటారు. ఇక్కడి వేడుకలో పాలుపంచుకుంటూ పరవశించి పోతుంటారు.


More Bhakti News