మరేడుదళాల నోము

కష్టాలు ... ఆపదలు ఎవరికీ చెప్పిరావు. అనుకోకుండా వచ్చిన వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలంటే అందుకు దైవానుగ్రహం ఎంతైనా అవసరం. అలా ఊహించని విధంగా వచ్చి ఉక్కిరిబిక్కిరి చేసే సంఘటనల నుంచి తక్షణమే గట్టెక్కించే నోమే 'మారేడు దళాల నోము'. ఈ నోముకి సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో వుంది.

యువకుడైన ఓ రాజ కుమారుడు ఏ వ్యాధి బారినపడకుండానే హఠాత్తుగా చనిపోయాడు. దాంతో రాజ కుటుంబంతో పాటు ప్రజలంతా కూడా కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఇక ఆచారం ప్రకారం రాజ కుటుంబానికి చెందిన శవాన్ని ఒంటరిగా ఖననం చేయకూడదు కాబట్టి, 'తోడు శవం'గా మారే వారి కోసం వెదుకులాట మొదలైంది. యువరాజు కోసం తమ ప్రాణాలు అర్పించడానికి ఎవరైనా ముందుకు వస్తే, వారి కుటుంబానికి పెద్ద మొత్తంలో ధనాన్ని ముట్టజెబుతారు. దాంతో ఓ స్త్రీ ... మారు శవంగా మారడానికి తన సవతి కూతురిని అమ్మేసింది.

యువరాజు శవంతో పాటు సైనికులు ఆ యువతిని కూడా స్మశానానికి తీసుకువెళ్లారు. అంతలో ఊహించని విధంగా గాలివాన ఆరంభమైంది. ఎంతకీ ఆ గాలివాన తగ్గక పోవడంతో, మరుసటి ఉదయమే ఖననం జరిపించడం మంచిదని భావించి, తాత్కాలికంగా శవాలను భద్ర పరిచే చోట ఆ శవాన్ని ... యువతిని వదిలి వెళ్లిపోయారు.

బందీగా వున్న ఆ యువతి అతి కష్టం మీద అక్కడి నుంచి బయటపడి, సమీపంలోవున్న 'కాళికా దేవి' ఆలయానికి వెళ్లి తనని కాపాడమంటూ అమ్మవారి పాదాలపై పడింది. కనికరించిన అమ్మవారు, ఆ యువతికి కొన్ని అక్షింతలు ఇచ్చి యువరాజు శవంపై చల్లితే అతను బతుకుతాడనీ, దాంతో ఆ గండం నుంచి ఆమె బయటపడుతుందని చెప్పింది. అమ్మవారు చెప్పినట్టు చేయగానే, యువరాజు పునర్జీవితుడై, జరిగిందంతా తెలుసుకున్నాడు. ఆ యువతిని వెంటబెట్టుకుని ఆ రాత్రే ఇంటికి చేరుకున్నాడు.

సజీవుడై తిరిగి వచ్చిన యువరాజును చూసి అంతా ఆశ్చర్య పోయారు. అందుకు కారణమైన యువతిని అంతా అభినందించారు. ఆ తరువాత మంచి ముహూర్తం చూసి యువరాజు ఆ యువతిని పెళ్లి చేసుకున్నాడు. సకల సంపదలూ ... సుఖ సంతోషాలు ఉన్నప్పటికీ, అమ్మవారు చెప్పిన మాట మరువకుండా ఆ యువతి 'మారేడు దళాల నోము' నోస్తూనే వచ్చింది.

ఏడాది పాటు ప్రతి రోజు మారేడు దళాలతోను ... బియ్యంతోను శివార్చన చేసింది. ఏడాది పూర్తి అయిన తరువాత చివరి రోజున ఒక 'వెండి మారేడు దళం' ... ఒక 'బంగారపు మారేడు దళం' ... ఒక 'సహజమైన మారేడు దళం' కలిపి మూడు దోసిళ్ల బియ్యంతో శివుడిని అభిషేకించింది. ఆ తరువాత పేదలకు అన్నదానం నిర్వహించి ఉద్యాపన చెప్పుకుంది.


More Bhakti News