సాలగ్రామాలను స్త్రీలు తాకకూడదా ?

సాధారణంగా సాలగ్రామాలు ఆలయాల్లో దర్శనమిస్తుంటాయి. వివిధ వర్ణాల్లో ... ఆకారాల్లో కనిపించే సాలగ్రామాలు గండకీ నదీతీరంలో లభిస్తుంటాయి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అవతారంగా చెప్పుకునే ఈ సాలగ్రామాలను ఇంట్లో ఉంచి పూజించేవారు చాలా తక్కువగా ఉంటారు. ఈ కారణంగానే ఇవి ఎక్కువగా దేవాలయల్లోనే దర్శనమిస్తూ ఉంటాయి. ప్రధాన దైవంగా చెప్పుకునే మూలమూర్తితో పాటు పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాయి.

పూర్వం జలంధరుడు అనే రాక్షసుడిని ఆయన భార్య 'బృంద' పాతివ్రత్య మహిమ కాపాడుతూ ఉంటుంది. దుర్మార్గుడైన ఆ రాక్షసుడిని సంహరించడం కోసం బృంద పాతివ్రత్యానికి శ్రీమహావిష్ణువు భంగం కలిగిస్తాడు. ఆ కారణంగా బృంద శాపానికి గురైన ఆయన సాలగ్రామ శిలగా పూజలు అందుకుంటున్నాడని పురాణాలు చెబుతున్నాయి. అలా గండకీ నదీ తీరంలో సాలగ్రామ రూపాల్లో స్వామి ఆవిర్భవిస్తూ వస్తున్నాడు.

సాక్షాత్తు విష్ణు స్వరూపంగా చెప్పబడుతోన్న ఈ సాలగ్రామాలు, ఆయా పరిణామాలను ... చిహ్నాలను బట్టి స్వామివారికి సంబంధించిన వివిధ నామాలతో పిలవబడుతుంటాయి. ఇక ఇంతటి విశిష్టత కలిగిన సాలగ్రామాలను ఇంట్లో ఉంచి పూజించాలనుకుంటే అందుకు ఎంతో నియమ నిష్టలను పాటించవలసి ఉంటుంది. పూజా మందిరాల్లో గల ఈ సాలగ్రామాలను స్త్రీలు తాకరాదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

అత్యంత విశిష్టమైనవిగా చెప్పబడుతోన్న సాలగ్రామాలను అభిషేకించడం వలన సకల సంపదలు కలుగుతాయనీ, ఆ అభిషేక జలాన్ని తీర్థంగా స్వీకరించడం వలన సమస్త వ్యాధులు నియంత్రించబడతాయని స్పష్టం చేస్తున్నాయి.


More Bhakti News